● చట్టసభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
భువనగిరిటౌన్: చట్టసభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల రాజు కోరారు. ఈమేరకు సోమవారం భువనగిరికి వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు.
● ఏపీఎస్‌ఈబీ రూల్స్ అమలు చేయాలి
భువనగిరి: ఆర్టీజన్ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ నిబంధనలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్– 82 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మంత్రి జగదీశ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం కమిటీ జిల్లా కార్యదర్శి భాస్కర్ నాయక్ మాట్లాడారు.
● విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ
గుండాల: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి కొడపర్తి వెంకటేష్ తన తండ్రి అయిలయ్య జ్ఞాపకార్థం పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో కొడపర్తి పుల్లమ్మ, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ షర్ఫోద్దీన్, ప్రధానోపాధ్యాయుడు ఐతరాజు గిరివర్ధన్, కొడపర్తి భాస్కర్ పాల్గొన్నారు.
● విద్యార్థినులకు పరిశుభ్రతపై అవగాహన
గుండాల: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం వ్యక్తిగత పరిశుభ్రతపై డాక్టర్ హైమావతి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం స్వర్ణలత, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు షమీమ్, యాకుపాషాబేగం, అంగన్‌వాడీ టీచర్ సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
● పోషకాహారంతో ఆరోగ్యం
రామన్నపేట: సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమని సీడీపీఓ శాగంటి శైలజ అన్నారు. సోమవారం సిరిపురం ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోషకాహారం, రక్తహీనత సమస్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మీనా, రత్న, సూపర్‌వైజర్ హేమలత, టీచర్లు పాల్గొన్నారు.
● పౌష్టికాహారంపై అవగాహన
రాజాపేట: పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సర్పంచ్ ఆడెపు ఈశ్వరమ్మ, మండల వైద్యాధికారి డాక్టర్ భరత్‌కుమార్ అన్నారు. రాజాపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమణ, ప్రధానోపాధ్యాయులు మహేందర్ రెడ్డి, మల్లెమాల, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
వలిగొండ: పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని మహిళా శిశు సంక్షేమ అధికారిణి గోద ధనమ్మ అన్నారు. సోమవారం వలిగొండ మండల కేంద్రం ఆవాస గ్రామం మల్లెపెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లెర్ల భాగ్యమ్మ రాజు, అంగన్‌వాడీ టీచర్ నిర్మల, యాదమ్మ పాల్గొన్నారు.
● బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
భువనగిరి: మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన దోమ్మాట ఆంజనేయులు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ పీఏసీఎస్ డివిడెండ్ నిధి నుంచి బాధిత కుటుంబానికి రూ.30 వేల ఆర్థికసాయాన్ని చైర్మన్ మందడి లక్ష్మీనర్సింహారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ఎలిమినేటి మల్లారెడ్డి, డైరెక్టర్లు ఉన్నారు.
● విజయోత్సవ కరపత్రాలు విడుదల
మోత్కూరు: ఈ నెల 30న నిర్వహించనున్న శ్రీవీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీ కర పత్రాలను సోమవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మోత్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ వంగాల జానకిరాంరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహేందర్, గుండు శ్రీను, బిళ్లపాటి గోవర్ధన్‌రెడ్డి, గునగంటి శ్రీధర్, వివేక్, భాను, శేఖరాచారి పాల్గొన్నారు.
● కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఆలేరురూరల్: మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఇక్కిరి రాణి, జూకంటి మౌనికలకు మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను సోమవారం ఎంపీటీసీ జూకంటి అనురాధ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆమె వెంట సర్పంచ్ కట్టా సమరసింహారెడ్డి, ఉపసర్పంచ్ నీల రామన్న, వీఆర్‌ఏ చక్రపాని, వెంకటేశ్వర్లు, రమేష్, మాధవరెడ్డి, శ్రావణ్, యాదగిరి తదితరులున్నారు.
● విద్యార్థులు సమాజసేవలో ముందుండాలి
వలిగొండ : విద్యార్థులు సమాజసేవలో ముందుండాలని కేర్చిపల్లి సర్పంచ్ మద్దెల మంజుల అన్నారు. మండల కేంద్రంలోని ప్రగతి డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్1 విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం కెర్చిపల్లిలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమణ, పీఓ ధనుంజయ్య, ఉపాధ్యాయులు శ్రీశైలం, వెంకటేశం, ప్రణయ్ కుమార్, గోపి, దయాకర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
● ఎల్‌బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు
నామకరణం చేయడం హర్షణీయం
మోత్కూరు: హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ చౌరస్తాకు తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు శ్రీకాంతాచారి పేరు నామకరణం చేస్తూ మంత్రి కేటీఆర్ ప్రకటించడం హర్షణీయమని మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యాకుబ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సాధనలో శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని, ఆయన పేరు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుందని పేర్కొన్నారు.
● 12వ రోజుకు చేరిన
లప్పానాయక్ తండావాసుల దీక్ష
యాదగిరిగుట్ట రూరల్: బస్వాపురం రిజర్వాయర్‌లో సర్వస్వం కోల్పోతున్న తమను ప్రభ్వుత్వం పట్టించుకోవాలని మండలంలోని లప్పానాయక్ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం, పునరావాసం కల్పించాలని కోరుతూ తండావాసులు చేపట్టిన నిరసన దీక్ష సోమవారం 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అందించి, నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బుజ్జి శంకర్, ఉపసర్పంచ్ మంక్యానాయక్, బిచ్చానాయక్ పాల్గొన్నారు.
● శ్రీరామలింగేశ్వర స్వామి కల్యాణం
వలిగొండ: మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో సోమవారం శ్రీపార్వతీ సమేత శ్రీ పంచముఖ రామలింగేశ్వర స్వామివారి కల్యాణం జరిపించారు. అంతకుముందు రుద్రహోమం, శ్రీసూక్త హోమం, మహాపూర్ణాహుతి, త్రిశూల స్నానం, పుష్పయాగం, పవళింపు సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జయరామయ్య, విగ్రహాల దాత పద్మా భూపాల్ గౌడ్ దంపతులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.