మోటకొండూర్: మండలంలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను సోమవారం మండల ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా చామాపూర్, చాడ, తేర్యాల, చందేపల్లి, మోటకొండూర్, గిరిబోయినగూడెం, ఆరేగూడెం గ్రామాల్లో 101మంది రైతులకు చెందిన 192ఎకరాల వరి, 23మంది రైతులకు చెందిన 142ఎకరాల్లో మామిడి తోట నష్టపోయినట్లు గుర్తించారు. కార్యక్రమంలో ఎంపీపీ పైళ్ల ఇందిర, జెడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సుబ్బూరి సుజాత, గీత, బొంగు పుల్లయ్య, ఏనుగు అంజిరెడ్డి, నర్సింహారెడ్డి తదితరులున్నారు.
ఆత్మకూరు(ఎం): మండలంలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు వరి ధాన్యం, మామిడి కాయలు రాలిపోయాయి. ఆత్మకూరు(ఎం), సింగారం, కొరటికల్, మొరిపిరాల, పోతిరెడ్డిపల్లి, పారుపల్లి, పల్లెపహాడ్, రహీంఖాన్‌పేటలో భారీగా నష్టం వాటిల్లింది. సోమవారం మండల వ్యవసాయ అధికారి శిల్ప నష్టపోయిన పంటలను పరిశీలించారు.