ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
తణుకు అర్బన్: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తణుకు సజ్జాపురంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన తండ్రి పిల్లలను క్షేమంగా కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సజ్జాపురం శివాలయం వంతెన సమీపంలో ఆకుల రత్తయ్య కుటుంబంతో సహా ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి 3.30 గంటల సమయంలో ఇంట్లో మంటలు వ్యాపించి ఇళ్లంతా పొగపట్టి ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన రత్తయ్య ఇంట్లో నిద్రిస్తున్న తన భార్యతోపాటు కుమారులను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే పొగ ధాటికి పిల్లలకు స్వల్ప అస్వస్థత ఏర్పడింది. ఈ ప్రమాదంలో కిచెన్‌లోని సామాగ్రితోపాటు వరండాలో ఉన్న వాషింగ్‌మెషిన్, ఫ్రిజ్ తదితర సామాగ్రి అగ్నికి ఆహుతైపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని, నష్టం రూ.1.50 లక్షలుగా అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. కాగా గత 40 రోజులుగా లారీ కిరాయికి వెళ్లిన రత్తయ్య సరిగ్గా ఆదేరోజు రాత్రి ఇంటికి రావడంతో తామంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
పిల్లలను క్షేమంగా కాపాడిన తండ్రి


