కోటి ఆశలతో వర్జీనియా సాగు | - | Sakshi
Sakshi News home page

కోటి ఆశలతో వర్జీనియా సాగు

Dec 9 2025 6:57 AM | Updated on Dec 9 2025 6:57 AM

కోటి

కోటి ఆశలతో వర్జీనియా సాగు

పరిమితికి మించి పండించొద్దు

జంగారెడ్డిగూడెం: కోటి ఆశలతో వర్జీనియా పొగాకు సేద్యానికి రైతన్న సిద్ధమయ్యారు. గతేడాది, ఈ ఏడాది వర్జీనియా పొగాకు చరిత్రలోనే రికార్డు ధరలు లభించడంతో ఉత్సాహంతో సాగుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది ధర మరింత ఎక్కువ లభించింది. దీంతో రైతులు ఈ ఏడాది మరింత విస్తీర్ణంలో సాగుకు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే రైతులు వర్జీనియా నాట్లు పూర్తి చేసే దశకు చేరుకున్నారు. 2024–2025 సీజన్‌కు కేజీ అత్యధిక ధర రూ.456 లభించింది. ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో సరాసరి ధర రూ. 297.50 కేజీకి లభించింది. 2023–2024 సీజన్‌కు కేజీకి అత్యధిక ధర రూ.411 లభించగా, సరాసరి ధర రూ.300 లభించింది. రాబోయే సీజన్‌కు మరింత మంచి ధర లభిస్తుందనే ఆశతో రైతులు వర్జీనియా సాగు చేపట్టారు. వాస్తవానికి ఈ పాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉండగా, ఈ ఏడాది వేలం ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగడంతో ఆలస్యమైంది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 9267 మంది వర్జీనియా రైతులు 10,516 బ్యారన్‌లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 16,824 ఎకరాల్లో సేద్యం చేసేందుకు నడుం బిగించారు. ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 2526 సీజన్‌కు 36.96 మి.కిలోల పంటకు పొగాకు బోర్డు అనుమతించింది. ఇప్పటి వరకు 16,524 హెక్టార్లలో నాట్లు పూర్తి చేశారు. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోకి వచ్చే తూర్పుగోదావరి జిల్లాలోని తొర్రేడు ప్రాంతంలో నల్లరేగడి భూముల్లో పండే పంట కోసం 724 మంది రైతులు 775 బ్యారన్‌లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 852 హెక్టార్లలో పంట పండించేందుకు సమాయాత్తమయ్యారు. ఇక్కడ 1.63 మిలియన్‌ కిలోల పంటకు అనుమతించారు. ఇప్పటి వరకు తొర్రేడు ప్రాంతంలో 418 హెక్టార్లలో నాట్లు వేశారు. వర్జీనియా సాగుకు సేద్యపు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది కన్నా 10 శాతం ఖర్చులు పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పొలం దుక్కిదున్నిన నాటి నుంచి పచ్చిరొట్ట విత్తనం, దుక్కి, లైనింగ్‌, నారు, తోట వేసేందుకు కూలీలు, పురుగుమందులు, ఎరువులు, అంతర్గత యాజమాన్యం, కలుపు తీత, కలుపు మందు, ఆకు రెలుపు, బ్యారన్‌ క్యూరింగ్‌, కలప, రవాణా, అన్ని రకాల కూలీల ఖర్చులు, బ్యారన్‌ లీజు అన్ని కలుపుకుని ఏటా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఈ ఖర్చు మరింత పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి సరాసరిన 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.

విపరీతంగా పెరిగిన కౌలు, బ్యారన్‌ లీజు

2025–2026 పంట కాలానికి పొలం కౌలు, బ్యారన్‌ లీజులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ఏడాది వర్జీనియా ధర రికార్డు స్థాయిలో లభించడంతో రైతులు పోటీపడి మరీ కౌలు, బ్యారన్‌ లీజులు పెంచి మరీ వర్జీనియా సేద్యానికి దిగారు. పొలం కౌలు ఎకరానికి రూ.70 వేలు, రూ.90 వేలు, నేర సారవంతాన్ని బట్టి ఉండగా, బ్యారన్‌ లీజు రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు పలికింది. వర్జీనియా రైతులంతా ఈ ఏడాది ధరను చూసి కోటి ఆశలతో రానున్న సీజన్‌కు పంట పండించేందుకు సిద్ధమయ్యారు.

వర్జీనియా రైతులు పొగాకు బోర్డు నిర్ణయించిన పంట పరిమితికి మించి పండించరాదు. విదేశాల్లో కూడా వర్జీనియా ఉత్పత్తి పెరిగింది. వినియోగం మాత్రం పెరగలేదు. ఈ ఏడాది ఎక్కువ పంట పండినా విదేశీ ఆర్డర్లు రావడంతో మంచి ధర వచ్చింది. కానీ జింబాబ్వే, బ్రెజిల్‌ దేశాల్లో వర్జీనియా పంట పెరుగుతోంది. తక్కువ విస్తీర్ణంలో నాణ్యత గత పంట ఎక్కువ దిగుబడి ఇచ్చేలా పండిస్తే లాభదాయకం. ఆర్గానిక్‌ పద్దతిలో సమతుల ఎరువులు వాడి లోగ్రేడ్‌ పొగాకు రాకుండా పంట పండిస్తే లాభదాయకం.

జీఎల్‌కే ప్రసాద్‌, పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌

కోటి ఆశలతో వర్జీనియా సాగు 1
1/2

కోటి ఆశలతో వర్జీనియా సాగు

కోటి ఆశలతో వర్జీనియా సాగు 2
2/2

కోటి ఆశలతో వర్జీనియా సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement