జనం చెంతకు గిరిజన ఉత్పత్తులు
ప్రజల చెంతకు జీసీసీ ఉత్పత్తులు
బుట్టాయగూడెం: అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులను ప్రజల చెంతకు చేర్చేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రత్యేక కృషి చేస్తుంది. అడవుల్లో గిరిజనులు సేకరించిన ముడి సరుకులను జీసీసీ అధికారులు కొనుగోలు చేసి వాటి ద్వారా రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తయారు చేసిన ఉత్పత్తులను జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన షాపుల్లో, మొబైల్ వ్యాన్, వారాంతపు సంతల్లో విక్రయిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు లేని సరుకులు కావడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ శాతం మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గిరిజన ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ప్రధానంగా అరకు కాఫీతో పాటు గిరిజన తేనె, త్రిఫల పౌడర్, ఆయిల్, గిరిజన సబ్బులకు మంచి గిరాకీ ఉంది. గిరిజన సహకార సంస్థ కోటరామచంద్రపురం పరిధిలో 26 జీసీసీ చౌక డిపోల్లో గిరిజన ఉత్పత్తులు అమ్మకాలు ఎక్కువగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అటవీ ఉత్పత్తుల విక్రయాలు ఇలా
అటవీ ప్రాంతం నుంచి గిరిపుత్రులు సేకరించిన చింతపండు, పుట్ట తేనె, చెట్ల తేనె, నరమామిడి చెక్క, కరక్కాయలు, నల్ల జీడిగింజలు, ముసిడి గింజలు, అడవి ఉసిరి కాయలు, శీకాయలు, కుంకుడు కాయలు వివిధ రకాల పండ్లు సుమారు 30 రకాల వరకూ చిన్న తరహా ఉత్పత్తులు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సేకరిస్తుంది.
అరకు కాఫీకి పెరిగిన డిమాండ్
జీసీసీ ద్వారా విక్రమిస్తున్న అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉండడంతో ఈ కాఫీకి డిమాండ్ పెరిగింది. అరకు కాఫీ పశ్చిమ మన్యం ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో జీసీసీ అధికారులు కేఆర్‌పురం ఐటీడీఏ, బుట్టాయగూడెంలో అరకు కాఫీ విక్రయ షాపులను ఏర్పాటు చేశారు. తాటి బెల్లంతో తయారు చేసిన ఆర్గానిక్ బిస్కెట్లు, ఉండలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఎంతో ఇష్టంగా వాటిని కోనుగోలు చేస్తున్నారు.
రూ.19.50 కోట్ల అమ్మకాలు
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కేఆర్‌పురం పరిధిలో గల బుట్టాగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు సుమారు 26 అటవీ ఉత్పత్తులు, నిత్యవసర సరుకులు విక్రయించే డిపోలు ఉన్నాయి. వీటితో పాటు జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, ఏలూరు, నర్సాపురం, పాలకొల్లు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో గిరిజన అటవీ ఉత్పత్తులు షాపుల్లో విక్రయించేలా అధికారులు ఏర్పాటు చేశారు. వీలిలో 2025 –26 ఆర్థిక సంవత్సరానికి రూ.32.54 కోట్ల అమ్మకాలు టార్గెట్ కాగా 2025 డిసెంబర్ వరకూ సుమారు రూ.19.5 కోట్ల అమ్మకాలు జరిగినట్లు జీసీసీ అధికారులు తెలిపారు. మిగిలిన టార్గెట్ మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని చెబుతున్నారు.
అటవీ వస్తువులకు మంచి గిరాకీ
జీసీసీ ద్వారా విక్రయిస్తున్న ఉత్పత్తులను ప్రజల చెంతకు చేరేలా కృషి చేస్తున్నాం. కోటరామచంద్రాపురం జీసీసీ పరిధిలోని 26 డిపోల్లో విక్రయాలు చేస్తున్నాం. గిరిజన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఈ ఏడాది సుమారు కేఆర్‌పురం జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు, పెట్రోలు, గ్యాస్ తదితర అన్ని రకాల అమ్మకాలు సుమారు రూ. 19 కోట్ల 50 లక్షల వరకూ జరిగాయి.
చెరుకూరి రాజయోగి, కేఆర్‌పురం జీసీసీ మేనేజర్, బుట్టాయగూడెం మండలం
జనం చెంతకు గిరిజన ఉత్పత్తులు
జనం చెంతకు గిరిజన ఉత్పత్తులు
జనం చెంతకు గిరిజన ఉత్పత్తులు


