డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడ్డ కారు
ద్వారకాతిరుమల: అడ్డొచ్చిన బైక్‌ను తప్పించే క్రమంలో ఓ భక్తుడి కారు రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. స్థానిక సంగం డెయిరీ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆకివీడుకు చెందిన ఓ భక్తుడు సోమవారం ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించి, మొక్కుబడులు తీర్చుకున్నాడు. అనంతరం తన కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ఒక బైక్ అడ్డొచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, రోడ్డు మద్యలో బోల్తా పడింది.
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్ అపాయింట్‌మెంట్, ప్రమోషన్‌లు తప్పుల తడకగా ఉందని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అన్నంరెడ్డి వేణుగోపాలరావు ఆరోపించారు. ఆ మేరకు ఈవోపై దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీలను విడుదల చేశారు. శ్రీనివాస్ అపాయింట్‌మెంట్ నుంచి ప్రమోషన్ వరకు అంతా తప్పల తడకగా ఉందని, శ్రీనివాస్‌ను 2002లో అప్పటి ఆలయ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు జూనియర్ అసిస్టెంట్‌గా నియమించుకున్నారన్నారు. సర్వీసు రిజిస్టర్‌లో 1993లో క్లర్క్‌గా జాయిన్ అయినట్లు నమోదు చేసుకున్నారన్నారు. అప్పటి నుంచి పనిచేస్తున్నట్లుగా జీతం పెంచుకుంటూ వచ్చారన్నారు. శ్రీనివాస్ సర్వీసు రిజిస్టర్‌లో జగపతిరాజు తప్ప మిగిలిన వారి ఎవరి సంతకాలు లేకపోవడం గమనించాల్సిన విషయమన్నారు. ఆయన సర్వీసుపై విచారణ జరిపించాలన్నారు. ఫిర్యాదు కాపీలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ తదితరులకు పంపినట్లు తెలిపారు.


