టిడ్కో రుణమాఫీ కోరుతూ ధర్నా
తాడేపల్లిగూడెం: టిడ్కో ఇళ్ల కోసం బ్యాంకులు ఇచ్చిన రుణాలను మాఫీ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిగూడెంలో ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల్లో కనీస అవసరాలు తీరుస్తా మని కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అ మలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా సెక్రటరీ పొగాకు పూర్ణ మాట్లాడుతూ ఏ బ్లాక్ వారికి రుణమాఫీ జరిగిందని, గత ప్రభుత్వంలో రుణాలు చెల్లించడానికి లబ్ధిదారులు ముందుకు వస్తే, కూటమి నాయకులు అడ్డుకుని, తమ ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తామని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఆ నాయకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బ్యాంకుల నుంచి రికవరీ బృందాలు వచ్చి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వీరిని అడ్డుకోవాలన్నారు. అలాగే టిడ్కో గృహాల సముదాయంలో పాముల బెడద అధికంగా ఉందని, చెత్తను కూడా శుభ్రం చేయడం లేదన్నారు. పట్టణ కార్యదర్శి బి.యశోద, ఎం.పావని, మండల కార్యదర్శి పి.సత్యవతి, మహిళలు పాల్గొన్నారు.


