ముద్దాపురం సొసైటీలో యూరియా రచ్చ
టీడీపీ వర్గాల ఇళ్లలో నిల్వలు
తణుకు అర్బన్: తణుకు మండలం ముద్దాపురం సొసైటీలో యూరియాను అక్రమంగా టీడీపీ వర్గానికి చెందిన రైతులకు కట్టబెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతనెలలో సొసైటీలో ఉన్న యూరియా బస్తాలను టీడీపీ వర్గాలకు చెందిన రైతులు తమ ఇస్టానుసారంగా ట్రాక్టర్లపై తోలుకుపోయారని ఆందోళనకు దిగారు. దీంతో 16న తణుకు మండల వ్యవసాయాధికారులకు ఫిర్యాదుచేయగా సొసైటీకి వచ్చిన ఏడీ నరేంద్ర, ఏవో రాజేంద్రప్రసాద్ యూరియా తరలింపును నిలుపుదల చేశారు. సొసైటీలో యూరియా అందుబాటులోకి వచ్చిందని రైతులు ఫలానా రోజు సొసైటీకి వచ్చి తీసుకెళ్లాలని టముకు వేసి చెప్పే నిబంధన గతం నుంచి ఉందని.. టీడీపీ వారికి మాత్రమే యూరియాను ముందస్తుగా అందచేశారని పలువురు రైతులు చెబుతున్నారు. టీడీపీ వర్గాల ఇళ్లలో తనిఖీలు చేపడితే యూరియా నిల్వలు దొరుకుతాయని అంటున్నారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని కలిసేందుకు ఈనెల 2న ముద్దాపురం వెళ్లిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు రైతులు యూరియా తరలింపు వ్యవహారాన్ని తెలిపారు. వ్యవసాయాధికారులతో కారుమూరి ఫోన్‌లో మాట్లాడుతూ యూరియాను అక్రమంగా పంపిణీ చేస్తే సహించబోమన్నారు.
ట్రాక్టర్లపై తరలింపు
ముద్దాపురానికి సంబంధించి 1,870 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 84 టన్నులు, కోనాలకు సంబంధించి 139 టన్నులు యూరియా దాళ్వాకి అందుబాటులో ఉంచాల్సి ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఒక్కో ఎకరాకు 3 బస్తాల యూరియా అవసరం ఉన్నప్పటికీ నాలుగున్నర బస్తాల చొప్పున రైతులు వినియోగిస్తుంటారు. సొసైటీలో యూరియా ఇస్తున్నారన్న వార్తతో ముద్దాపురానికి చెందిన రైతులు తమ ధ్రువపత్రాలతో సహా వచ్చినప్పటికీ ఇవ్వకపోవడంతో సొసైటీ సిబ్బందిని నిలదీశారు. అధికారులు 100 బస్తాలు ఇచ్చారని చెబుతున్నప్పటికీ అంతకంటే అధికంగానే యూరియాను టీడీపీ వర్గాలు తరలించుకుపోయారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై తణుకు వ్యవసాయాధికారి రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా యూరియా పంపిణీని నిలుపుదల చేశామని చెప్పారు.
టీడీపీ వర్గాల ఇళ్లలో యూరియా
నిల్వలంటూ రైతుల ఆరోపణలు
యూరియా అవసరం లేకపోయినా టీడీపీ వర్గానికి చెందిన రైతులకు సొసైటీ సిబ్బంది దొడ్డిదారిన అందచేశారు. గతనెలలో ట్రాక్టర్లు వేసుకుని వచ్చి యూరియాను పట్టుకుపోయారు. మిగిలిన రైతులు కూడా మాకు యూరియా ఇవ్వమని అడిగితే అప్పుడే ఇవ్వమని చెప్పారు. నేడు పచ్చ చొక్కా వేసుకుంటేనే యూరియా ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. – ముళ్లపూడి సుబ్బారావు, రైతు, ముద్దాపురం
							ముద్దాపురం సొసైటీలో యూరియా రచ్చ

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
