అగ్నిప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తి నష్టం
ముదినేపల్లి రూరల్: మండలంలోని బొమ్మినంపాడు శివారు జానకిగూడెంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన పుప్పాల సాయికి పశువులపాక, దాని పక్కనే గడ్డివాము ఉన్నాయి. ఊహించని రీతిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పశువుల పాక, గడ్డివాము పూర్తిగా దగ్ధమయ్యాయి. పాకలో ఉన్న పశువుల సైతం మంటలకు గాయపడ్డాయి. సమాచారం అందుకున్న కై కలూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిస్థాయిలో ఆర్పివేసి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేశారు.
భీమవరం: పట్టణంలోని చిన్న వంతెనపై నుంచి యనమదుర్రు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన కలిదిండి మండలం పెదపుట్లపూడి గ్రామానికి చెందిన నడికుదిటి వేంగిరాజు (65) మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు. కొంత కాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న మృతుడు ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 31న బయటకు వెళ్లి కాలువలోకి దూకినట్లు అతని కుమార్తె లక్ష్మీ పార్వతి ఫిర్యాదు చేసింది. హెడ్ కానిస్టేబుల్ భూషణం కేసు నమోదు చేశారు. మొగల్తూరు మండలం పాతపాడు దగ్గర మృతదేహాన్ని కాలువలో సోమవారం గుర్తించామన్నారు.
బుట్టాయగూడెం: మోంథా తుపాను కారణంగా సుమారు వారం రోజులపాటు నిలిచిపోయిన పాపికొండలు పర్యాటక బోటు ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. జలవనరుల శాఖ అధికారుల అనుమతితో ఆదివారం ప్రారంభం కాగా సుమారు మూడు బోట్లలో పలువురు పర్యాటకులు పాపికొండలు విహార యాత్రకు వెళ్లారు. రెండో కార్తీక సోమవారం కావడంతో పర్యాటకులు పాపికొండల పర్యటనకు వెళ్ళారు. దేవీపట్నం, గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండల పర్యాటక ప్రాంతం పేరంటపల్లికి ఈ బోట్లు చేరుకున్నాయి. పేరంటపల్లి శివాలయం వద్ద పర్యాటకుల తాకిడితో సందడిగా నెలకొంది.
ఆగిరిపల్లి: దొంగలు పట్టపగలే ఇంట్లో చొరబడి బంగారం చోరీ చేసిన ఘటన మండలంలోని కొత్త ఈదరలో సోమవారం జరిగింది. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం కొత్త ఈదర గ్రామానికి చెందిన బెక్కం పెద్ద సీత తన కుమారులు ఇద్దరు అమెరికాలో ఉండడంతో ఒంటరిగా నివసిస్తోంది. సోమవారం ఉదయం పాల కోసమని తాళం వేయకుండా గడియ పెట్టి వెళ్ళింది. ఇదే అదునుగా ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి ఆరు ఉంగరాలు, ఒక బంగారు గాజు, రెండు చెవి దిద్దులు పారిపోతుండగా, ఇంటి పక్కనే ఉన్న మహిళ అడ్డుకుంది. ఆ మహిళను తోసివేసి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. బంగారం విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితురాలు వాపోయింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
