ఆందోళనలో అన్నదాతలు
కడలి అల్లకల్లోలం
సాక్షి, భీమవరం: మోంథా తుఫాను దూసుకొస్తోంది. తీరం వెం ్డ బలమైన గాలులతో కెరటాలు ఎగసిపడుతున్నాయి. జిల్లా అంతటా ముసురు కమ్ముకుని ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తుపాను రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
సోమవారం ఉదయం నుంచి మోంథా ప్రభావం మొదలైంది. తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమైంది. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల సమయానికి జిల్లాలో 25.4 మి.మీ వర్షం కురవగా మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 101 మి.మీ, 2.30 గంటల సమయానికి 135.6 మి.మీ, 6.30 గంటల సమయానికి దాదాపు 180 మి.మీ వర్షం కురిసింది. రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. మొగల్తూరు, నరసాపురం, పెనుమంట్ర, పాలకొల్లు, పెనుగొండ మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తీరం వెంట అలలు ఎగసిపడుతున్నాయి. ఈదురుగాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్య్సకారులు వేటకు వెళ్లకుండా నిషేధించారు. పేరుపాలెం బీచ్‌లోకి పర్యాటకులను అనుమతించడం లేదు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని, రాత్రికి కాకినాడ – మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
అధికారుల సమీక్ష : పునరావాస ఏర్పాట్లు, నష్ట నివారణ చర్యలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కోస్తా జిల్లాల తుపాను ప్రత్యేక అబ్జర్వర్ ఆర్‌పీ సిసోడియా సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్, ఎస్పీ అద్నాన్ నయీం అష్మీలతో సమీక్షించారు. మోంథాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్టు ఆయన వివరించారు. జిల్లాలో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయడంతో పాటు 26 పక్కా భవనాలను పునరావాస కేంద్రాల నిర్వహణకు సిద్ధం చేసినట్టు సిసోడియా తెలిపారు. గర్భిణులు, వృద్ధులను సమీప పీహెచ్‌సీలకు తరలించినట్టు చెప్పారు. అవసరమైన సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ నరసాపురంలో సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. 68 జేసీబీలు, 57 పవర్ సాసర్లు సిద్ధం చేశామన్నారు. నరసాపురం నియోజకవర్గంలోని పెద్దమైన వానిలంక, వేముల దీవి, బియ్యపుతిప్ప, చిన్నమైనవానిలంక, పాతపాడు, కేపి పాలెం గ్రామాల్లో జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్, జేసీ టి. రాహుల్‌కుమార్‌రెడ్డిలు పర్యటించి పునరావాస ఏర్పాట్లను పరిశీలించారు.
నరసాపురం: నరసాపురం తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం పడింది. తీరం పొడవునా సముద్రం 50 మీటర్లు మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. ఆదివారం రాత్రి నుంచి తీరం వెంట సముద్ర అలల తీవ్రత ఎక్కువగానే ఉంది. నరసాపురం, మొగల్తూరు మండలాలల్లో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవానిలంక, మొగల్తూరు మండలంలో పేరుపాలెం బీచ్‌ల్లో ఒక్కసారిగా పరిస్థితి మారింది. పేరుపాలెం బీచ్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహం సమీపం వరకూ కెరటాలు చొచ్చుకు వస్తున్నాయి. చినమైనవానిలంకలో పాత తుపాను షెల్టర్ బిల్డింగ్ సమీపం వరకూ సముద్రం చొచ్చుకు వచ్చింది. పెదలంక, తూర్పుతాళ్లు, మోళ్లపర్రు ప్రాంతాల్లో సముద్రగట్టు కోతకు గురైంది. మంగళవారం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు 25 గ్రామాలపై తుపాన్ ప్రభావం ఉండొచ్చని అధికారులు గుర్తించారు. దీంతో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీఎం లంకలోని డిజిటల్ భవనంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అవసరమైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆర్డీవో దాసి రాజు ఆదేశించారు. తుఫాన్ తీవ్రతను బట్టి 10 వేల మందిని పునరావస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టామని ఆర్డీవో తెలిపారు.
జిల్లా అంతటా కమ్ముకున్న ముసురు
అల్లకల్లోలంగా తీరం
నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆందోళనలో అన్నదాతలు
ఆక్వాలో ఆక్సిజన్ సమస్య
జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా ప్రస్తుతం పంట కీలక వెన్నుదశలో ఉంది. ఇప్పటికే తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో వరి కోతలు జరుగుతుండగా మరో పది రోజుల్లో జిల్లా అంతటా మొదలుకానున్నాయి. విత్తనాలు, నారుమడి తయారీ, పంట దమ్ము, నాట్లు, ఎరువులు, పురుగు మందులు, కూలి ఖర్చులు తదితర రూపాల్లో ఇప్పటికే ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. మరో పదిరోజుల్లో పంట కోత కొచ్చి తమ కష్టం గట్టెక్కుతుందని గంపెడాసతో ఉన్నారు. ఈ తరుణంలో తుఫాను రైతులను బెంబేలెత్తిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆకివీడు, కాళ్ల, ఉండి, నరసాపురం తదితర చోట్ల నాలుగు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. సోమవారం నాటి వర్షానికి పెనుమంట్ర, వీరవాసరం, పోడూరు తదితర ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. మంగళ, బుధవారాల్లో గాలులతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గాలులు, వర్షాలకు వెన్ను బరువెక్కి పంట నేలకొరగడం, ముంపునకు గురికావడం వలన గింజ తాలుగా మారిపోయి దిగుబడులు దెబ్బతింటాయని రైతులు వాపోతున్నారు. మరోపక్క చలిగాలుల ప్రభావంతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చేపలు, రొయ్యల చెరువుల్లో సాధారణ పీపీఎం లెవల్స్ ఐదు నుంచి ఆరు కాగా ప్రస్తుత వాతావరణంతో 3.4కు పడిపోతుండటంతో ఆక్సిజన్ లెవల్స్ పెంచుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
ఆందోళనలో అన్నదాతలు
ఆందోళనలో అన్నదాతలు


