జగన్ జపం చేయనిదే నిద్రపట్టదా?
నిమ్మలపై గుడాల గోపి ఆగ్రహం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జపం చేయనిదే నిద్రపట్టడం లేదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ది పనులకు కూడా మంత్రి నిమ్మల శిలా ఫలకాలు వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వంలో వాటర్ వర్క్స్‌లో రూ.13 కోట్లతో పంప్ హౌస్ ప్రారంభిస్తే అక్కడ జనరేటర్ ఏర్పాటుచేసి దానికో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవం చేయడం చూస్తుంటే నిమ్మల పబ్లిసిటీ పరాకాష్ట అర్థమవుతుందన్నారు. తెల్లారితే చాలు తట్ట మట్టి, సిమెంట్ బస్తా అంటూ వైఎస్సార్‌సీపీ బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. తట్ట మట్టి, సిమెంట్ బస్తా వాడకుండానే నియోజకవర్గంలో 56 సచివాలయాలు, 80 హెల్త్ సెంటర్లు, 80 ఆర్‌బీకేల నిర్మాణం జరిగిందా? అని ప్రశ్నించారు. ఎదుటివారి అభివృద్ధి కూడా తన ఖాతాలోనే వేసుకోవాలని చూడడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. మీకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే మొదటి సంవత్సరం శ్రావణమాసంలో ఇస్తామని మహిళలకు ఇచ్చిన టిడ్కో గృహాల హామీని నెరవేర్చి అప్పుడు ప్రచారం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికే రెండు శ్రావణమాసాలు వెళ్లాయి పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వాలంటే ఇంకా ఎన్ని వెళ్లాలో అని అన్నారు. టిడ్కో గృహాలు మిగిలిన పది శాతం వైఎస్సార్‌సీపీ చేయలేకపోయిందని దుష్పచారం చేశారని, ఆ పది శాతం పూర్తిచేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల సమయం కావాలని నిలదీశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాసరావు, మద్దా చంద్రకళ, బండి రమేష్, జోగి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


