కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
భీమవరం (ప్రకాశంచౌక్): మోంథా తుపాను నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురియనున్న దృష్ట్యా కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. డివిజనల్, మండల స్థాయి కంట్రోల్ రూమ్‌ల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి సంబంధిత సమాచారాన్ని ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని, నదీ తీరం, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి విజ్ఞప్తి చేశారు. సోమవారం భీమవరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి జల వనరులు, మున్సిపల్, ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యనమదుర్రు డ్రెయిన్ ప్రవాహ వేగాన్ని గమనించి ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు. గట్లు బలహీనంగా ఉన్నచోట్ల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. బ్యాంక్ కాలనీ బీఎంకే రైస్ మిల్ ప్రాంతంలో యనమదుర్రు కట్ట ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భీమవరం డివిజన్‌కు సంబంధించి రూరల్‌లో మూడు, కాళ్లలో ఒకటి, ఆకివీడులో ఒకటి, భీమవరం టౌన్‌లో ఒక్క పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. 36 మందితో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం జిల్లాకు వచ్చిందని, అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ అవసరమైన చోట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ప్రజలకు సూచనలు చేస్తున్నట్లు చెప్పారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నరసాపురం రూరల్: నియోజకవర్గ తీర ప్రాంత గ్రామాలలో జిల్లా ప్రత్యేక అధికారి ప్రసన్న వెంకటేష్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సముద్ర అలల ఉధృతిని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు


