కార్మికుల సమ్మె బాట | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమ్మె బాట

Oct 22 2025 6:41 AM | Updated on Oct 22 2025 6:41 AM

కార్మ

కార్మికుల సమ్మె బాట

జిల్లాలో ఆసుపత్రి వివరాలు

తణుకు అర్బన్‌: ఆసుపత్రుల్లోని పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. తమకు 4 నెలల వేతన బకాయిలు, 40 నెలల పీఎఫ్‌ సొమ్ము తక్షణమే ఇవ్వాలని, ఆస్పత్రిలోని బెడ్‌లకు అనుగుణంగా 50 మంది కార్మికులను కేటాయించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నుంచి ఆందోళన బాట పట్టారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలతోపాటు మేనెలలో కూడా వేతనం ఇవ్వలేదని కానీ అధికారులు మాత్రం మే నెల వేసేశామని చెబుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు బకాయిలు ఉండగా తరచూ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో కూడా కార్మికులు సమ్మెబాట పట్టగా వైద్యాధికారులు చర్చలు జరపడంతో విధుల్లోకి వచ్చారు. జిల్లాలో మిగిలిన ఆస్పత్రుల్లోని కార్మికులు కూడా సమ్మెబాట పట్టేలా ఉన్నారని తెలుస్తోంది.

ఒక్క రోజుకే కంపు...

పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో మంగళవారం ఒక్కరోజుకే ఆస్పత్రి అంతా కంపు కొట్టింది. ఆస్పత్రి వార్డుల్లోకి వెళ్లాలంటే దుర్వాసనతో దుర్గంధంగా మారిందని రోగులు ఆరోపిస్తునారు. వార్డుల్లో ఏర్పాటుచేసిన డస్ట్‌బిన్‌లు నిండిపోయి నేలపై వ్యర్థాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ముఖ్యంగా బాలింతలు, బిడ్డలు ఉన్న వార్డులో చెత్త, వ్యర్థాలు నేలపైనే పడిపోయి కడు దయనీయంగా మారింది. వార్డులో ఉన్న టాయిలెట్స్‌ సైతం రొచ్చు కంపుతో కునారిల్లిపోయింది. ఆవరణ, వార్డుల్లో ఉన్న డస్ట్‌బిన్‌లు నిండిపోయి నేలపై పడిపోయిన వ్యర్థాలతో ఆస్పత్రి అంతా దుర్వాసన వెదజల్లుతోంది. సమ్మె కొనసాగితే ఆస్పత్రిలోని బాలింతలు, గర్భిణులు, వివిధ శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయని ఆస్పత్రి వర్గాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

డీసీహెచ్‌ఎస్‌, ఆర్డీవో చర్చలు విఫలం

పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో మంగళవారం ఉదయం డీసీహెచ్‌ఎస్‌ సూర్యనారాయణ, ఆర్డీవో కౌసర్‌ బానో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చి వైద్యాధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో చర్చలు జరిపారు. ఈ రోజు రెండు నెలల వేతనాలు వేస్తే విధుల్లోకి వస్తామని కార్మికులు పట్టుబట్టడంతో చర్చలు విఫలమయ్యాయి. అనంతరం డీసీహెచ్‌ఎస్‌ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఈ సమస్య నెలకొందని, తణుకు ఆస్పత్రిలో 3 నెలల వేతన బకాయిలు, పీఎఫ్‌ పెండింగ్‌ సమస్యలతో కార్మికులు సమ్మెలోకి వెళ్లారని తెలిపారు. 48 గంటల్లో సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు. అప్పటివరకు తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపల్‌ కమిషనర్ల సహాయంతో ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు.

కూటమి పాలనలో

మూడు సమ్మె నోటీసులు

16 నెలల కూటమి పాలనలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు వేతన బకాయిలు, పీఎఫ్‌ సొమ్మును ఇప్పించాలని మూడుసార్లు సమ్మె నోటీసులు వైద్యాధికారులకు అందచేశారు. మొదటగా 5 నెలల వేతన బకాయిలతో ఈ ఏడాది మార్చి 4వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లుగా 3వ తేదీన, 4 నెలల వేతన బకాయిలతో సెప్టెంబరు 29 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని 27వ తేదీన, తిరిగి 4 నెలల వేతన బకాయిలతో ఈనెల 21 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని 17వ తేదీన వైద్యాధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు.

జిల్లా ఆస్పత్రి 1

ఏరియా ఆస్పత్రులు 4

కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు 3

పారిశుధ్య కార్మికులు 135

నిత్యం 6 వేలకు పైగా అవుట్‌ పేషెంట్స్‌, వెయ్యిలోపు ఇన్‌ పేషెంట్స్‌

విధులు బహిష్కరించిన ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు

4 నెలల వేతన, 41 నెలల పీఎఫ్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌

ఆస్పత్రుల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు

రోగులపై పడనున్న సమ్మె ప్రభావం

కార్మికుల సమ్మె బాట 1
1/2

కార్మికుల సమ్మె బాట

కార్మికుల సమ్మె బాట 2
2/2

కార్మికుల సమ్మె బాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement