శ్రీవారికి దీపావళి ఉత్సవం
ద్వారకాతిరుమల: బాణ సంచా వెలుగుల నడుమ ఉభయ దేవేరులతో శ్రీవారికి కోవెల ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రతి ఏటా క్షేత్రంలో దీపావళి ఉత్సవాన్ని ఘనంగా జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే పండుగ తిథిలో తగులు, మిగులు రావడంతో శ్రీవారి దేవస్థానం అధికారులు దీపావళిని మంగళవారం రాత్రి నేత్రపర్వంగా జరిపారు. క్షేత్ర పురవీదుల్లో అంగరంగ వైభవంగా జరగాల్సిన ఈ ఉత్సవం, ఆకాశం మేఘావృతం కావడంతో ఆలయానికే పరిమితమైంది. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని దీపాలతో విశేషంగా అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లను తోళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం శ్రీవారి వాహనాన్ని కోవెల చుట్టూ మూడుసార్లు తిప్పారు. దేవస్థానం సిబ్బంది స్వామివారి వాహనం ముందు, అలాగే ఆలయ ప్రధాన రాజగోపురం మెట్లపై పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఇదిలా ఉంటే స్వామివారి రాక కోసం.. వేయి కళ్లతో ఎదురు చూసిన గ్రామ ప్రజలు, గ్రామోత్సవం రద్దవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
నూజివీడు: పట్టణంలోని ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన కళాశాల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది. మండలంలోని బోర్వంచ సమీపంలోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ వద్ద 40 మంది విద్యార్థులతో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులందరూ క్షేమంగా బయటపడటంతో కళాశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 23, 24 తేదీల్లో ఏలూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండర్ 14, అండర్ 17 బాల బాలికల క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కే. అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 23వ తేదీన వాలీబాల్ ఎంపిక పోటీలు కొవ్వూరు అల్లూరి వెంకటేశ్వరరావు వాలీబాల్ గ్రౌండ్స్ ఎన్‌టీఆర్ స్టేడియంలో, 24న ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు దేవరపల్లి ఏఎస్‌ఎన్‌ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి జరుగుతాయన్నారు. అండర్ 14 జట్లకు వచ్చే విద్యార్థులు 2012 జనవరి 1 వ తేదీ నుంచి, అండర్ 17 జట్ల ఎంపికకు వచ్చే విద్యార్థులు 2009 జనవరి 1వ తేదీ నుంచి జన్మించినవారై ఉండాలన్నారు. వివరాలకు 90308 94311, 814330 96604 నంబర్‌లలో సంప్రదించవచ్చన్నారు.
బాలిక అదృశ్యంపై కేసు
తణుకు అర్బన్: బాలిక అదృశ్యంపై తల్లి ధనకొండ దుర్గమ్మ ఫిర్యాదుమేరకు తణుకు రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు మండలం తేతలి బస్టాండ్ ప్రాంతంలో తాత్కాలికంగా నివసిస్తున్న గంగిరెద్దుల వృత్తిలో ఉన్న దుర్గమ్మ తన పిల్లలను అక్కడే విడిచిపెట్టి ఉపాధిలో భాగంగా గంగిరెద్దులు ఆడించుకుంటూ ఊరూరా తిరిగేందుకు ఈనెల 20వ తేదీన ఉదయం వెళ్లింది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి నివాస ప్రాంతానికి వచ్చేసరికి తన పిల్లల్లో 5 ఏళ్ల వయస్సున్న బాలిక వీరమ్మ కనిపించలేదు. పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన వీరు నాలుగు రోజుల క్రితమే ఉపాధి కోసం తేతలి వచ్చారు. బాలిక ఆచూకీ తెలిస్తే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ 9441144789లో తెలియచేయాలని కోరారు.
శ్రీవారికి దీపావళి ఉత్సవం
శ్రీవారికి దీపావళి ఉత్సవం


