తణుకులో గంజాయి కలకలం | - | Sakshi
Sakshi News home page

తణుకులో గంజాయి కలకలం

Oct 20 2025 7:19 AM | Updated on Oct 20 2025 7:19 AM

తణుకు

తణుకులో గంజాయి కలకలం

ఎకై ్సజ్‌ దాడులతో వెలుగులోకి

యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు

తణుకు అర్బన్‌: తణుకు ప్రాంతంలో తెరవెనుక విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు ఆందోళన కలిగిస్తోంది. గంజాయి విక్రయాలు, కొనుగోళ్లకు తణుకు ప్రాంతం అడ్డాగా మారిందనడానికి ఇటీవల తణుకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ అధికారులకు తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి ఉదాహరణ. ఈ నెల 12న తణుకు–ఉండ్రాజవరం జంక్షన్‌లో ఎకై ్సజ్‌ శాఖ నిర్వహించిన దాడుల్లో ద్విచక్ర వాహనంపై రూ.15 వేల విలువైన 5 కిలోల గంజాయి తరలిస్తూ ముగ్గురు యువకులు పట్టుబడ్డారు. అందులో ఒకరు తప్పించుకున్నారు. ఈ ముగ్గురు యువకులు తణుకు మండలం మండపాక, పైడిపర్రుకు చెందిన వారిగా ఎకై ్సజ్‌ పోలీసులు తెలిపారు. దీంతో పైడిపర్రు ప్రాంతం గంజాయి విక్రయాలకు అనువుగా ఉందని, విక్రయించే వారు సైతం ఇక్కడే తిష్టవేశారని తెలుస్తోంది. తణుకు ఉండ్రాజవరం రోడ్డులోని శ్మశాన వాటికలో గంజాయిని నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో ఎకై ్సజ్‌ పోలీసులు దాడిచేసి వాహనంపై తరలిస్తుండగా పట్టుకున్నారు.

తణుకులో సంచలన ఘటనలు

గత నెలలో తణుకులో జరిగి భారీ చోరీలో 70 కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. తాడేపల్లిగూడెంకు చెందిన యువకుడిని తణుకులో హత్య చేయడం వంటి ఘటనలు సంచలనం రేకెత్తించగా తాజాగా గంజాయి వ్యవహారం బయటపడడంతో తణుకులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రశాతంతకు మారుపేరుగా ఉండే తణుకులో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో తణుకు వాసులు బెంబేలెత్తిపోతున్నారు. 5 కిలోల గంజాయిని ద్విచక్ర వాహనంపై సాధారణంగా తరలించుకుపోవడం చూస్తుంటే తణుకులో గంజాయి వినియోగం ఏ స్థాయిలో ఉందోనని భయపడుతున్నారు. యువతకు అంగట్లో దొరికే ఒక సాధారణ వస్తువు మాదిరిగా గంజాయి తణుకులో అందుబాటులో ఉందనే అనుమానాలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

అనుమానిత ప్రాంతాలపై నిఘా

తణుకు మునిసిపాలిటీ పరిధిలోని సంతమార్కెట్‌, టీటీడీ కల్యాణ మండపం, రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో గంజాయి వాడకం, విక్రయాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తణుకులో శ్మశాన వాటికల్లో గంజాయిని దాచిపెడుతున్నారనే విషయం ఇటీవల నిర్వహించిన ఎకై ్సజ్‌ దాడుల్లో బహిర్గతమైంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో గంజాయిని రోడ్డు మీదే కొందరు అలవాటుపడ్డ వ్యక్తులు దమ్ములాగుతూ కనిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి మార్కెట్‌లో విక్రయాలు జరుపుతున్నారని సమాచారం. గంజాయి తరలిస్తూ పట్టుబడిన పైడిపర్రుకు చెందిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, అతనిపై పలు ప్రాంతాల్లో 5 కేసులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. పోలీసులు గట్టిగా దృష్టిపెడితే గంజాయి అమ్మకాలను నిరోధించే పరిస్థితులు ఉంటాయని, ఇటీవల కాలంలో పోలీసులకు బందోబస్తులు, సమావేశాల్లో పాల్గొనేందుకే సమయం కేటాయించలేని పరిస్థితి. ఇక గంజాయి తదితర వ్యవహారాలపై దృష్టిసారించే సమయం లేదనేది వాస్తవంగా కనిపిస్తోంది. ఇటీవల యువత అధికంగా గంజాయికి అలవాటు పడి విక్రయించే వారికోసం ఎదురుచూపులు చూసే పరిస్థితి తణుకులో నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంజాయి మత్తులో యువత నేరాలకు పాల్పడుతున్నారని, ఈజీ మనీ కోసం చైన్‌ స్నాచింగ్‌కు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. గంజాయి విక్రయాలను అరికట్టాలని, పోలీసులు, నేర విభాగం నిఘా పెట్టి గంజాయి విక్రయాలకు చెక్‌ పెట్టాలని పలువురు కోరుతున్నారు.

తణుకులో గంజాయి కలకలం1
1/1

తణుకులో గంజాయి కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement