కరుణించు మంగమ్మ తల్లీ
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ నిషేధంపై ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు గుబ్బల మంగమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ఎవరూ ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాకుండా చర్యలు చేపట్టారు.
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్‌లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు.
ముదినేపల్లి రూరల్: అధిక కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారంటూ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. మండలంలోని వాడవల్లికి చెందిన అచ్యుత సంధ్యకు సీతారామపురానికి చెందిన యర్రంశెట్టి రమేష్‌తో ఏడాది కిందట వివాహం జరిగింది. వివాహానంతరం ప్రతీరోజూ భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారు. కొంతకాలం కిందట భర్త, అత్తమామలు సంధ్యను ఇంటి నుంచి గెంటేయగా పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల పుట్టింటికి వెళ్లి వీరు గొడవపడ్డారని సంధ్య పిర్యాదులో పేర్కొంది. వేధింపులను అరికట్టి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కరుణించు మంగమ్మ తల్లీ


