నూతన కార్మిక విధానానికి వ్యతిరేకంగా పోరాడాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): శ్రమ శక్తి పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన కార్మిక విధానాన్ని నిరసిస్తూ, రాష్ట్రంలో పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో నాయకులు రాష్ట్ర కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పట్టణంలో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు శనివారం స్థానిక సిపాయి పేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగాయి. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు డి.సోమసుందర్, జే.లలితమ్మ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఏఐటీయూసీ సమావేశాలలో 26 జిల్లాలకు చెందిన 47 మంది కార్మిక నేతలు, ప్రతినిధులు మాట్లాడారు. పనిని భారంగా మార్చడాన్ని నాయకులు తప్పు పట్టారు. నవంబర్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా తలపెట్టిన నిరసన దినాన్ని రాష్ట్రంలో విజయవంతం చేస్తామని నాయకులు తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోతే పవన్ కళ్యాణ్ కార్యాలయాన్ని ముట్టడించాలని వెల్లడించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతుండడంతో ఆయన స్థానంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్న ఎస్.వెంకట సుబ్బయ్యను ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర కౌన్సిల్ తీర్మానాన్ని అమోదించారు.


