జిల్లాలో శాస్త్రవేత్తల బృందం పర్యటన
ఉండి: వరిపంటలో వచ్చే తెగుళ్లు, నాణ్యమైన రకాల పరిశీలనకు శాస్త్రవేత్తల బృందం శనివారం జిల్లాలో పర్యటించింది. ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం కేవీకే నుంచి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు, డాక్టర్ పీ వినయలక్ష్మి, ప్రాంతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం మార్టేరు నుంచి డాక్టర్ ఎం గిరాజారాణి, డాక్టర్ వీ భవనేశ్వరీ, డాక్టర్ పీవీ రమేష్‌బాబు బృందం జిల్లాలోని పెనుమంట్ర మండలం ఎస్‌ఐ పర్రు, పెంటపాడు మండలం జట్లపాలెం, ఉండి మండలం యండగండి తదితర ప్రాంతాల్లో పర్యటించి వరిసాగులో వచ్చే తెగుళ్లు, వాటిని తట్టుకునే రకాలపై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఐ పర్రులో గత వర్షాలకు వరిలో బాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చి వ్యాప్తి చెందినప్పటికీ దానికదే తగ్గుముఖం పట్టిందని అన్నారు. అయితే ఉధృతి ఎక్కువగా ఉన్న రైతులు ఎకరాకు 400 గ్రా.కాపర్ హైడ్రోజన్‌తో పాటు 200 గ్రా.పాంటో మైసిన్‌ను పిచికారీ చేసుకుని నత్రజని ఎరువుల వినియోగం తగ్గించాలని సూచించారు. ఎంటీయు 1318, 1262, 1121 మొదలైన రకాలు వర్షాల్లో ఈనినప్పుడు మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున గింజరంగు మారకుండా మానిపండు రాకుండా ఉండటం కోసం చిర్రుపొట్ట నుంచి పిగులు పొట్ట దశలో ప్రోపికొనజోల్ అనే మందును ఎకరాకు 200 మి.లీ పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నట్లు శాస్త్రవేత్తల బృందం తెలిపారు.


