‘సాక్షి’పై కూటమి కుట్రలు
● నేడు జర్నలిస్ట్, ప్రజాసంఘాలతో ధర్నాలు
● దాడులను నిరసిస్తూ అధికారులకు వినతులు
సాక్షి, భీమవరం: నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు సాక్షి మీడియాపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. పోలీసులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. నోటీసులు, విచారణల పేరుతో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను కాలరాస్తోంది. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డికి నాలుగురోజుల వ్యవధిలో పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. పత్రికా స్వేచ్ఛపై, ప్రజల పక్షాన పోరాడుతున్న సాక్షిపై కూటమి దాడిని ఖండిస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా జర్నలిస్ట్, ప్రజాసంఘాలు శాంతియుతంగా నిరసన తెలిపి అధికారులకు వినతులు అందజేయనున్నట్టు ఏపీయూడబ్ల్యూఏజే జిల్లా అధ్యక్షుడు వీఎస్ సాయిబాబా తెలిపారు. భీమవరంలో జరిగే కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రజాసంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు నిజాలు తెలియకుండా సాక్షిని అణగదొక్కాలని చూస్తోంది. విచారణ పేరుతో మీడియా ప్రతినిధులను వేధింపులకు గురిచేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. దీనిని అందరూ సంఘటితంగా ఎదుర్కోవాలి.
– బంధన పూర్ణచంద్రరావు,
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్
పత్రికా స్వేచ్ఛను కాలరాయాలని చూడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిది. పత్రికా కథనాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయబద్ధంగా ఎదుర్కోవాలే తప్ప ఇలా వ్యవహరించడం సరికాదు. ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తున్నాం. సాక్షి మీడియా ప్రతినిధులపై వేధింపులు ఆపాలి.
– కోనాల భీమారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి
‘సాక్షి’పై కూటమి కుట్రలు


