చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
తాడేపల్లిగూడెం రూరల్ : చోరీ కేసులో ఇద్దరు నిందితులతో పాటు ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తాడేపల్లిగూడెం రూరల్ సీఐ బీబీ రవికుమార్ తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. పెంటపాడు మండల, పరిసర ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీ, దొంగతనాలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయన్నారు. ఈ క్రమంలోనే రావిపాడు గ్రామానికి చెందిన పెదపోలు శ్రీనివాస్ తన ఇంటి ముందు షెడ్డులో ఉన్న మోటారు సైకిల్ చోరీకి గురైనట్లు గత నెల 18న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముందస్తు సమాచారం మేరకు చిలకంపాడు లాకుల వద్ద ర్యాలీ లోకేష్, మానుపాటి దుర్గాప్రసాద్, మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, మోటారు సైకిళ్ల దొంగతనాలను వారు అంగీకరించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించగా, లోకేష్, దుర్గాప్రసాద్‌లను అరెస్టు చేశామన్నారు. మోటారు సైకిళ్ల విలువ రూ.2.75 లక్షలుగా పేర్కొన్నారు. మానుపాటి దుర్గాప్రసాద్‌పై తణుకు, ఇరగవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆలయాల్లో హుండీ, ఇళ్లు, మోటారు సైకిళ్ల దొంగతనాలకు సంబంధించి పలు కేసులు ఉన్నాయన్నారు. కాగా, ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పెంటపాడు ఎస్సై కేసీహెచ్ స్వామి, కానిస్టేబుళ్లు అనిల్‌కుమార్, బి.మోహన్, కే.నవీన్, డి.వెంకటేశ్వరరావులను అభినందించారు.


