రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు
భీమవరం: కేంద్ర పాలకులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని దానివల్ల లౌకికవాదం, ప్రజాస్వామ్యం దెబ్బతింటాయని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం లౌకిక వేదిక ఆధ్వర్యంలో మంగళవారం యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన లౌకిక సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం దేశ ప్రజలకు అనేక హక్కులను కల్పించిందని సమానత్వాన్ని సాధించాలంటే రిజర్వేషన్లు ఉండాలని ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ అనేక చట్టాలను రూపొందించిందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగం ప్రసాదించిన అనేక హక్కులను తుంగలో తొక్కుతూ మనువాద రాజ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. మహనీయులు చేసిన త్యాగాలను గుర్తించకుండా దూషించడం, మతోన్మాద చర్యలకు అడ్డుపడుతున్న వారిపై దాడులు చేయడం రోజురోజుకీ పెరుగుతోందని శర్మ అన్నారు. కార్యక్రమంలో ఉద్దరాజు రామం ఫౌండేషన్ చైర్మన్ మంతెన సీతారామ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.జేమ్స్ పాల్గొన్నారు.


