ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
పాలకొల్లు సెంట్రల్: కార్తీకమాసంలో క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆలయంలో పనితీరు అనుకున్నంత బాగాలేదని ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్లాస్టిక్ కవర్లు వాడకుండా బుట్టలను ఏర్పాటుచేయాలన్నారు. ఆలయం బయట అరటిపళ్లు, కొబ్బరికాయలు విక్రయించే షాపుల వారికి చెప్పి బుట్టల్లో పెట్టి స్వామివారి పూజా సామాగ్రి ఇచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్నం 11 గంటల వరకూ ప్రసాదం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో దాశి రాజు, ఎండోమెంట్స్ ఏసి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


