కార్తీక మాసంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం పూజలకు వచ్చే భక్తులు, యాత్రికులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు అన్నారు. శుక్రవారం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అధికారులు, భక్తులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు రాత్రి సమయంలో బస చేసేలా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవదాయ శాఖ సత్రాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. శనివారం సంత రోడ్డులో దిగిన యాత్రికులు చేపల మార్కెట్‌లో నుంచి వస్తున్నారని భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయడమా.. బస్సులను ఎన్టీఆర్ కళాక్షేత్రం వరకూ తీసుకొచ్చి అక్కడ దిగి ఆలయానికి వెళ్లేలా చూడడమా అనేది నిర్ణయిస్తామన్నారు. శనివారం, ఆదివారం, సోమవారం, కార్తీక పౌర్ణమి, శిల్క్ ద్వాదశి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్, మున్సిపల్ కమిషనర్ బి.విజయసారథి, సీఐ కోలా రజనీకుమార్, ఈవోపీఆర్డీ మూర్తిబాబు, ఫైర్ ఆపీసర్ వైవీ జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ, గుర్తింపు పొందిన ఉద్యాన కళాశాలల్లో బీఎస్సీ(హానర్సు) ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశం కోసం మూడో దశ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు 16, 17 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీ పాలక భవనంలో కౌన్సిలింగ్ నిర్వహిహిస్తారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు స్వయంగా తగిన ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు.


