నేడు కార్తీక మాసఏర్పాట్లపై సమీక్ష
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్ 22 నుంచి కార్తీకమాసం పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ పూజా కార్యక్రమాలు నవంబర్ 20వ తేదీ వరకూ జరగనున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నతాధికారులు భక్తులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కార్తీకమాసంలో ఆలయానికి వచ్చే భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఏడాదైనా భక్తులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. క్షీరారామలింగేశ్వరస్వామి ఆల యం చుట్టూ అనేక సత్రాలు ఉన్నాయి. ఈ సత్రాలను ఈ నెల రోజులు భక్తుల సౌకర్యార్థం ఉపయోగిస్తే బాగుంటుందని భక్తులు, హిందూ సంఘాల నాయకులు కోరుతున్నారు.
బస్సుల సమస్య తీరేనా?
అలాగే ఆలయానికి వచ్చే భక్తులను చిన్నకార్ల స్టాండ్ వద్ద దింపేసి బస్సులను శనివారం సంత మార్కెట్ రోడ్డు నుంచి మార్కెట్ యార్డులోకి తరలిస్తున్నారు. అయితే బస్సులు ఎక్కడ ఉన్నా యో? భక్తులు వెతుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చిన్నకార్ల స్టాండ్ నుంచి ఎన్టీఆర్ కళాక్షేత్రం వరకూ బస్‌లను దారి మళ్లించి ఆలయం రోడ్డు వద్ద భక్తులు దిగేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. అలాగే భక్తులు రామగుండం పార్కు నుంచి ఎన్టీఆర్ కళాక్షేత్రం ద్వారా ఆలయానికి చేరేలా మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


