
మియావాకి విధానంలో చిట్టడవుల పెంపకం
ద్వారకాతిరుమల: ప్రస్తుత రోజుల్లో నానాటికీ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఆ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కల పెంపకం ఒక్కటే మార్గం. మొక్కల పెంపకంపై ప్రభుత్వాలు ఎన్ని ప్రచారాలు చేస్తున్నా అడవుల శాతం మాత్రం పెరగడం లేదు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే భవిష్యత్‌లో ఆక్సిజన్ శాతం భారీగా తగ్గుతుందని స్పష్టమవుతోంది. ఈ తరుణంలో జపాన్ వృక్ష శాస్త్రవేత్త అకీరామియావాకి అనుసరించిన మియావాకి (చిట్టి అడవులు) పద్ధతిలో జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొక్కలు పెంపకం చేపట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో 10 వేల మొక్కలను ఈ మియావాకి పద్ధతిలో నాటుతున్నారు.
లక్ష్యంతో ముందుకు..
విశాఖపట్టణానికి చెందిన మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీనివాసరావు ఇటీవల 5 వేల నేరేడు, మామిడి, వేప, రావి, మద్ది, కొండ తంగేడి తదితర జాతుల మొక్కలను అందించారు. వీటిని శ్రీవారి కొండపైన టోల్‌గేట్ పక్కనున్న రెండు ఎకరాల ఖాళీ స్థలంలో మియావాకి పద్ధతిలో నాటుతున్నారు. అలాగే పూళ్లకు చెందిన దాత పీవీ రామాంజనేయులు సహకారంతో శివాలయం కొండ దిగువన రెండు ఎకరాల ఖాళీ స్థలంలో ఫ్రూట్ బియరింగ్, శివుడికి ప్రీతికరమైన మారేడు, నాగమల్లి మొక్కలను నాటుతున్నారు. అదేవిధంగా లక్ష్మీపురం ఆర్చిగేటు వద్ద నుంచి గరుడాళ్వార్ విగ్రహం వరకు ఉన్న రోడ్డు మధ్యలోని డివైడర్‌లో పాక్ స్టైల్ మొక్కలు, కొత్త బస్టాండ్ వద్ద నుంచి పాత సినిమాహాలు వరకు డివైడర్‌లో టెర్మిలియన్ మెంటీలియన్ మొక్కలు నాటుతున్నారు.
సోము మొక్కలు ప్రత్యేకం
కొండపై నాటుతున్న మొక్కల్లో సోము జాతి మొక్క లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఆలయాల్లో ధ్వజస్తంభాలకు ఈ చెట్లను వినియోగిస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారు లు 100 మొక్కలను నాటించారు. ప్రస్తుతం ఈ పనులు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈఈ డీవీ భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ పర్యవేక్షణలో శరవేగంగా జరుగుతున్నాయి.
ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై వినూత్న ప్రయోగం
30 శాతం ఆక్సిజన్ పెరుగుతుందంటున్న నిపుణులు
మియావాకి విధానమే మేలు
మియావాకి విధానంలో మొక్కలు నాటడమే మేలు. పచ్చని ఆహ్లాదకర వాతావరణంతో పాటు స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్‌ను అందిస్తాయి. క్షేత్రంలో నానాటికి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం శుభపరిణామం. భవిష్యత్ తరాలకు ఈ చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నెలాఖరు నాటికి 10 వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.
– ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి, ఈఓ, ద్వారకాతిరుమల దేవస్థానం

మియావాకి విధానంలో చిట్టడవుల పెంపకం

మియావాకి విధానంలో చిట్టడవుల పెంపకం