
గుర్రపు డెక్కతో ముంపు ముప్పు
కై కలూరు: కొల్లేరు ప్రాంతానికి ప్రతిఏటా గుర్రపుడెక్క పెద్ద గుదిబండగా మారుతోంది. కొల్లేరుకు చేరే వరద నీటిని సముద్రానికి పంపే పెదఎడ్లగాడి వంతెన వద్ద గుర్రపుడెక్క పేరుకుపోవడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతోన్నారు. మొత్తం 56 ఖానాలకు గానూ సగం ఖానాలపైనే గుర్రపుడెక్క ఆక్రమించింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 12 మండలాలు పరిధిలో 2,22,300 ఎకరాలు విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో మొత్తం 122 గ్రామాలు ఉన్నాయి. డెక్క కారణంగా ప్రతి ఏడాదీ నీటి ప్రవాహం వెనక్కి మళ్లి కొల్లేరు గ్రామాలు ముంపులో చిక్కుకుంటున్నాయి.
67 డ్రెయిన్ల ద్వారా నీరు
వరదల సమయంలో ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్ల ద్వారా 1.10 లక్షల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. నీరంతా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం పెదఎడ్లగాడి, చిన్న ఎడ్లగాడి, పోలరాజ్ కాలువల ద్వారా ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలుస్తుంది. వాస్తవానికి కొల్లేరుకు చేరుతున్న 1.10 క్యూసెక్కుల నీటిలో 12 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే దిగువకు వస్తుంది. పెదఎడ్లగాడి నుంచి ఉప్పుటేరు వరకు ఛానలైజేషన్ చేయాలని 1895లో ఇరిగేషన్ ఎస్‌ఈ హుస్సేన్, 1964లో మిత్ర కమిటీ, 1986లో శ్రీరామకృష్ణయ్య కమిటీలు సూచనలు చేశాయి. అయితే ఇవేమి అమలు కాలేదు. దీనికి తోడు ప్రవాహానికి గుర్రపుడెక్క అడ్డు రావడంతో నీరు వెనక్కి మళ్లి లంక గ్రామాలు మునుగుతున్నాయి.
కొత్త రైల్వే బ్రిడ్జితో చిక్కులు
పెదఎడ్లగాడి వంతెన నుంచి వచ్చే వరద నీరు ఆలపాడు–ఆకివీడు గ్రామాల మధ్య ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి చేరాలి. ఉప్పుటేరుపై పాత బ్రిడ్జీ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం డబుల్ లైన్ నిమిత్తం మరో కొత్త బ్రిడ్జిని నిర్మించారు. వాస్తవానికి పాత బ్రిడ్జి ఖానా నుంచి ఖానా మధ్య 30 గజాల దూరం ఉంది. అదే కొత్త బ్రిడ్జి ఖానా నుంచి ఖాన మధ్య కేవలం 10 గజాల దూరం మాత్రమే ఉండడంతో గుర్రపుడెక్క మేటలు వేస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి గుర్రపు డెక్క సమస్యకు పరిష్కారం చూపాలని కొల్లేరు ప్రాంతవాసులు కోరుతున్నారు.
రూ.20 లక్షలతో ప్రతిపాదనలు
పెదఎడ్లగాడి వంతెన వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించడానికి రూ.20 లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఈ మేరకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కొల్లేరుకు చేరే నీటిని కిందకు పంపడానికి పెదఎడ్లగాడి వంతెన ఎంతో కీలకం. ఎగువ నుంచి వచ్చిన డెక్క ఖానాల మధ్య అడ్డుగా ఉంది. ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తున్నాం.
– ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈఈ, కై కలూరు
పెదఎడ్లగాడి వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్క
ఆందోళన చెందుతున్న కొల్లేరు ప్రాంతవాసులు

గుర్రపు డెక్కతో ముంపు ముప్పు