
నూతన విద్యావిధానాలపై పోరాడాలి
కుక్కునూరు: నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఐక్యంగా పోరాటం చేయాలని పీడీఎస్‌యూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని లచ్చిగూడెం గ్రామంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోయం కార్తీక్, తుర్రం నవీన్ మాట్లాడుతూ జీఓ నెంబర్ 117ను రద్దు చేస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం జీఓ నెంబర్ 19, 21లతో మరింత నష్టకరమైన తొమ్మిది రకాల బడుల విధానాన్ని ప్రవేశపెట్టడం దారుణమని అన్నారు. జీఓ నెంబర్ 117తో 12 వేల ఏకోపాధ్యాయ బడులు ఏర్పడగా వాటికి మరిన్ని జోడించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఉపాధ్యాయుడితో విద్యా బోధన అసాధ్యం అన్నారు. మూడు, నాలుగు తరగతులను ఉన్నత పాఠశాలకు బదిలీ చేయడం అనాలోచితం, అశాసీ్త్రయమని విమర్శించారు. ప్రపంచ బ్యాంక్ ద్రవ్యనిధి ఆదేశాల మేరకు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను 30 శాతం మేర తగ్గించేందుకు కుట్ర జరుగుతుందన్నారు, ప్రపంచ బ్యాంక్ రుణాలపై ఆధారపడిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 2020 జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చాయని, దీనిపై అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. సమావేశంలో పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.