
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
భీమవరం: ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, గ్రామాల్లో వలసలు నివారించి వ్యవసాయ కూలీలందరికీ 200 పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కలిశెట్టి వెంకట్రావు, కార్యదర్శి కళింగ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన సొమ్ము కోట్లాది రూపాయలు పెండింగ్ ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, రాజకీయ నాయకుల జ్యోక్యాన్ని పూర్తిగా నివారించాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందిపై కక్ష సాధింపులు, వేధింపులు నివారించాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూటీఎఫ్ ఆధ్వర్యంలో భీమవరంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో 1:45 నిష్పత్తి ప్రకారం బదిలీలు జరపాలన్నారు. ఏపీయూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలన్నింటిలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించి నాణ్యమైన విద్య అందించాలన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్, విద్యాశాఖాధికారికి అందించారు.
ప్రిన్సిపల్ అనుచిత ప్రవర్తనపై కలెక్టర్‌కు ఫిర్యాదు
భీమవరం/పాలకోడేరు: ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను భీమవరం పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.కృష్ణారావు మానసికంగా, శారీరకంగా వేధించాడంటూ భీమవరం రూరల్ మండలం చినఅమిరం గ్రామానికి చెందిన బాలిక తండ్రి సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ప్లస్ 2 చదువుతోందని.. ప్రిన్సిపల్ బాలికను తన చాంబర్‌కు పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెప్పినట్లు వినకపోతే పరీక్షలో ఫెయిల్ చేస్తానని, చంపుతానని బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భయపడి ఈ విషయాలను ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే బాధపడేదని.. ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఆ స్కూల్ మూసి వేస్తున్నట్లు, ఆ స్కూల్ యాజమాన్యంలో గొడవలు ఉన్నట్లు సమాచారం రావడంతో ధైర్యం తెచ్చుకుని తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పిందని.. తమ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ కృష్ణారావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఫిర్యాదులో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
19న అత్తిలి ఎంపీపీ ఎన్నిక
అత్తిలి: ఈ నెల 19న అత్తిలి ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అత్తిలి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 16 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, 4 స్థానాల్లో కూటమి పార్టీలు గెలుపొందాయి. ఎంపీపీగా మక్కా సూర్యనారాయణ రెండున్నరేళ్లు పని చేసి ఆ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. మార్చి 27న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగాల్సి ఉండగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను ఓటు వేయకుండా నిర్భందించడంతో ఎన్నిక నిలిచింది. మరుసటి రోజు ఎన్నిక జరగకుండా కూటమి నాయకులు అడ్డుపడ్డారు.
19న యలమంచిలి ఎంపీపీ ఎన్నిక
యలమంచిలి: ఈ నెల 19న యలమంచిలి ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నుంచి సోమవారం ఉత్తర్వులు వచ్చినట్లు ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత తెలిపారు. 15న సభ్యులకు ఎన్నికల నోటీసులు అందజేసి 19న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని ఆమె వివరించారు.