
12వ వేతన సవరణ కమిషన్‌ను తక్షణమే నియమించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు 12వ వేతన సవరణకు సంబంధించిన కమిషన్‌ను తక్షణమే నియమించాలని, అప్పటివరకు 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఏపీటీఎఫ్ 1938 జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక పంచాయతీరాజ్ మినీస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఈ రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుగ్గులోతు కృష్ణ మాట్లాడుతూ 11వ వేతన సవరణ కమిషన్ గడువు ముగిసి రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు 12వ వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడం సరైన విధానం కాదన్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న అన్ని రకాల ఆర్థిక బకాయిలను ఉద్యోగ, ఉపాధ్యాయులకు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు, మైనర్ మాధ్యమాలను కొనసాగించాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆన్‌లైన్ విధానంతో కూడిన మాన్యువల్ పద్ధతిలో బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కోరారు. 40 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్‌ను ప్రకటించాలని 6, 7, 8 తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు స్కూల్ అసిస్టెంట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీ మోహన్, ఉపాధ్యక్షుడు డీ శ్రీనివాసరావు, కార్యదర్శులు జీ వెంకటరమణ, పీ ఉమామహేశ్వరరావు, పీ నాగరాజు, గుంటూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.