
నిర్వాసితులను తరలించేందుకు ప్రత్యేక చర్యలు
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్
అభిషేక్
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న ఫేజ్ బి పరిధిలో ఉన్న నిర్వాసితులకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి వారిని తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ బి.అభిషేక్ తెలిపారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాటాడారు. రెండో దశలో సుమారు 32 గ్రామాల్లో 13,700 మంది నిర్వాసితులు ఉన్నారన్నారు. వీరందరికీ వీఆర్‌పురం, కూనవరం పరిధితోపాటు కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో నిర్వాసితులకు అనుకూలమైన భూములను సేకరించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. వీరికి నిర్వాసిత గ్రామాలు నిర్మించడంతోపాటు భూమికి భూమిగా కూడా భూసేకరణ చేయడం జరుగుతుందని చెప్పారు. నిర్వాసితులు కోరుకున్న ప్రదేశంలో ఇళ్లు నిర్మించడంతోపాటు వ్యవసాయ భూములను కూడా సేకరించేలా కృషి చేస్తామని చెప్పారు. గిరిజనులకు నివాసాలు కల్పించడంతోపాటు భూములను కూడా సేకరించి ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. వారు కోరుకున్న ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో భూములను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ నెలరోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ రమణ, తహసీల్దార్ పీవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.