
మద్ది అంజన్నకు పూజలు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా ఆంజనేయస్వామిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు. అంజన్నకు ప్రభాతసేవ, నిత్యార్చనలు అర్చకులు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,82,553 ఆదాయం వచ్చిందని ఈఓ ఆర్‌వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో 1500 మంది అన్నప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు. ఏర్పాట్లను కురగంటి రంగారావు పర్యవేక్షించారు.
దళితులపై దాడులు దారుణం
తాడేపల్లిగూడెం (టీఓసీ): గుంటూరు జిల్లా తెనాలిలో పట్ట పగలు, ప్రజలు చూస్తుండగా ఎస్సీ, మైనారిటీ యువకుల కాళ్లపై సీఐలు రాములు నాయక్, రమేష్ బాబు లాఠీలతో కొట్టడాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు తీవ్రంగా ఖండించారు. సీఐలను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణంలో మంగళవారం మంగరాజు విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో దళిత, ప్రజా సంఘాల తరుఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట విజయ్, ప్రియబాబు, నాగేశ్వరరావు ఉన్నారు.