భీమవరం : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతుందని ప్రధానంగా ఎన్నికల ఖర్చు తగ్గి పెద్ద ఎత్తున అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. సోమవారం భీమవరం డీఎన్నార్ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాట్లాడుతూ 2047 నాటికి దేశాభివృద్ధి లక్ష్యంతో ప్రధాని మోదీ వికసిత్ భారత్ ప్రారంభిచారన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు), ఉపాధ్యక్షుడు గోకరాజు పాండు రంగరాజు, డివైఈఓ డి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.