భీమవరం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి కొంత సమయం కేటాయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 241 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాకుండా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని ఆదేశించారు. మండల స్థాయిలోనే అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపితే జిల్లా స్థాయి వరకు ఎందుకు వస్తారని కలెక్టర్ నాగరాణి ప్రశ్నించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.