భీమవరం: ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ముందుగా తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో దాళ్వా సీజన్ ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై సివిల్ సప్లయిస్, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 308 రైతు సేవా కేంద్రాల ద్వారా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టామన్నారు. మండల వ్యవసాయ అధికారులు ఆయా రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సరి చూసుకుని సరైన నిర్ధారణతో సర్టిఫికెట్ అందచేయాలని ఆదేశించారు. సాధారణ రకం క్వింటాకు రూ.2,300, ఏ గ్రేడ్ రకానికి రూ.2,320 ధర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గోనె సంచులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని వాహనాలు, హమాలీలను ముందుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయిస్ మేనేజర్ టి.శివరామ ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.