
రేషన్ బియ్యానికి ఎసరు
ఈకేవైసీ పేరుతో 1.53 లక్షల మందికి ఝలక్
భీమవరం : కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల ఈకేవైసీ పేరుతో రేషన్ బియ్యం ఎగవేసేందుకు రంగం సిద్ధం చేసింది. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన పేదలకు పెద్ద ఎత్తున రేషన్ కార్డులు పంపిణీ చేయడమే గాక కుటుంబ సభ్యులు, పిల్లల పేర్లు కార్డుల్లో నమోదు చేసుకోవడానికి ప్రత్యేక అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను అమలుచేయకపోగా ఉన్న పథకాలకు ఎగనామం పెడుతోంది. గత పది నెలల కాలంలో ప్రభుత్వం కొత్తగా రేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంతో అనేకమంది కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల్లో పేర్లు ఉన్న వ్యక్తులు ఈకేవైసీ చేయించుకోకపోతే వచ్చే నెల నుంచి కోటా బియ్యం కోల్పోనున్నారు.
ఏప్రిల్‌లో 1.53 లక్షల మంది రేషన్‌కు ఎసరు
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 5,58,300 తెల్ల రేషన్ కార్డులుండగా వాటిలో దాదాపు 15,67,322 మంది సభ్యులున్నారు. వారికి ప్రతి నెల 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందుతోంది. రేషన్ పొందుతున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో రేషన్ డీలర్లు రేషన్ కార్డుల్లో పేరున్న వారితో వేలిముద్రలు వేయించుకుని ఈకేవైసీ చేస్తున్నారు. కొంతమంది ఉపాధి కోసం తాత్కాలికంగా వలస వెళ్లినవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు దూర ప్రాంతంలో ఉన్న తమ పిల్లల వద్దకు వెళ్లడం వంటి కారణాలతో ఈకేవైసీ చేయించుకోలేకపోయారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు 14,13,923 మందికి ఈకేవైసీ పూర్తి కాగా 1,53,399 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. దీంతో వీరికి అందాల్సిన సుమారు 7.70 లక్షల కిలోల బియ్యానికి గండిపడనుంది. ఈ మేరకు ఇప్పటికే రేషన్ డీలర్లకు కోత విధించి ఏప్రిల్ నెల బియ్యం పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తోంది. ఈకేవైసీ చేయించుకోవాల్సినవారు అత్యధికంగా భీమవరంలో 16,625 మంది ఉండగా తాడేపల్లిగూడెంలో 12,236 మంది, నరసాపురంలో 12,606 మంది, తణుకులో 11,690 మంది, మొగల్తూరులో 7,496, ఉండిలో 6,167, గణపవరంలో 5,601, యలమంచిలిలో 7,102, అత్తిలిలో 5,660, ఆచంటలో 5,512, పాలకోడేరులో 5,174, ఇరగవరంలో 6,599, ఆకివీడులో 6,372, కాళ్లలో 6,497, పెనుగొండలో 6,751, పోడూరులో 6,151, వీరవాసరంలో 5,809, పెనుమంట్రలో 5,028, పెంటపాడులో 4,836, పాలకొల్లులో 9,485 మంది ఉన్నారు.