
స్థానిక పదవులకు ఎన్నికలు
15 ఉప సర్పంచ్ పదవులకు ఎన్నిక
2021 ఫిబ్రవరి 13న పంచాయతీలకు ఎన్నికలు జరగగా, మరుసటి రోజున కౌంటింగ్ జరిగింది. చాలావరకు పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే సర్పంచులుగా గెలుపొందారు. ఆ సయమంలో ఎన్నికల కోడ్ ఉండటంతో దాదాపు నెలన్నర రోజుల ఆలస్యంగా ఏప్రిల్ 3న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. అదేరోజున ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. ఒప్పందం, ఇతర కారణాలతో పది మండలాల పరిధిలోని 15 ఉప సర్పంచ్ పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిలో నరసాపురం మండలంలోని మల్లవరం, భీమవరం రూరల్‌లోని గొల్లవానితిప్ప, గూట్లపాడు, ఎల్‌వీఎన్ పురం, తుందుర్రు, బేతపూడి, అత్తిలిలోని కేఎస్ గట్టు, ఇరగవరంలోని కోతపాడు, మొగల్తూరులోని పేరుపాలెం సౌత్, పాలకొల్లులోని అగర్తిపాలెం, గోరింటాడ, ఉండిలోని ఎన్‌ఆర్పీ అగ్రహారం, వీరవాసరంలోని పెర్కిపాలెం, యలమంచిలిలోని అబ్బిరాజుపాలెం, పాలకోడేరులోని గొరగనమూడి ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో 27న ఉప సర్పంచుల ఎన్నిక నిమిత్తం ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలని వార్డు సభ్యులకు పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నిక లాంఛనం కానుంది.
సాక్షి, భీమవరం: జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న రెండు ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ, 15 మంది ఉప సర్పంచ్ పదవుల భర్తీకి ఈ నెల 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎంపీటీసీ, వార్డు సభ్యులకు అధికారులు నోటీసుల జారీ చేశారు. అత్తిలి, యలమంచిలి మండల పరిషత్‌లు గతంలోనే వైఎస్సార్‌సీపీ కై వసం కాగా సంఖ్యా బలం, జెంటిల్‌మెన్ ఒప్పందం మేరకు ప్రస్తుత ఎన్నికల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా వైఎస్సార్‌సీపీ సభ్యుల ఎన్నిక లాంఛనం కానుంది. జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలకు 2021 ఏప్రిల్ 8న ఎన్నికలు జరగగా కోర్టు కేసులతో కౌంటింగ్ వాయిదా పడింది. తీర్పు అనంతరం సెప్టెంబరు 19న కౌంటింగ్ నిర్వహించగా 24న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు పోటీ నెలకొన్న చోట రెండున్నర సంవత్సరాల చొప్పున జెంటిల్‌మెన్ ఒప్పందం ప్రకారం పదవిని సర్ధుబాటు చేశారు. ఈ మేరకు అత్తిలి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, యలమంచిలి ఎంపీపీ గత ఏడాది మార్చి నెలలో తమ పదవులకు రాజీనామాలు చేయడంతో ఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి అప్పట్లో ఎన్నికలు జరపాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌తో ఆలస్యమైంది.
వైఎస్సార్‌సీపీదే హవా
తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు 16 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా టీడీపీ, జనసేన రెండేసి స్థానాల్లో గెలుపొందాయి. ఎంపీపీ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు కాగా ఒప్పందం ప్రకారం మొదటి రెండున్నరేళ్లు తిరుపతిపురం ఎంపీటీసీ సభ్యుడు మక్కా సూర్యనారాయణ ఎంపీపీగా, వైస్ ఎంపీపీలుగా మంచిలి ఎంపీటీసీ సభ్యురాలు దారం శిరీష, ఈడూరు ఎంపీటీసీ సభ్యుడు సుంకర నాగేశ్వరరావు పనిచేశారు. పదవీకాలం పూర్తికావడంతో సూర్యనారాయణ, శిరీష రాజీనామా చేయగా నాగేశ్వరరావు ఇన్‌చార్జి ఎంపీపీగా సేవలందిస్తున్నారు. నాటి ఒప్పందం ప్రకారం అత్తిలి –1 ఎంపీటీసీ సభ్యురాలు రంభ సుజాత ఎంపీపీగా, గుమ్మంపాడు ఎంపీటీసీ సభ్యుడు అద్దంకి శ్రీనును వైస్ ఎంపీపీగా లాంఛనంగా ఎన్నుకోనున్నారు.
పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ పీఠం జనరల్ మహిళకు రిజర్వయింది. మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు 14 చోట్ల వైఎస్సార్‌సీపీ, మూడు చోట్ల టీడీపీ, జనసేన ఒకటి గెలుపొందాయి. యలమంచిలి–1, ఏనుగువానిలంక ఎంపీటీసీ సభ్యులు రావూరి వెంకటరమణ, వినుకొండ ధనలక్ష్మి ఎంపీపీ పదవిని ఆశించారు. పెద్దలు కుదిర్చిన ఒప్పందం ప్రకారం మొదట బాధ్యతలు చేపట్టిన రావూరి వెంకటరమణ రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తికావడంతో గతంలోనే ఆమె రాజీనామా చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి ఎంపీపీగా వైస్ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎట్టకేలకు ఎంపీపీ ఎన్నిక జరుగనుండటంతో గత ఒప్పందం ప్రకారం ధనలక్ష్మిని ఎంపీపీని చేసే పనిలో వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారు.
రెండు ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ, 15 ఉప సర్పంచ్ పదవులు ఖాళీ
27న ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
నోటీసుల జారీ చేసిన అధికారులు