ఆ పార్టీలను మట్టిలో కలిపేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆ పార్టీలను మట్టిలో కలిపేస్తాం

Mar 25 2025 2:32 AM | Updated on Mar 25 2025 2:32 AM

ఆ పార్టీలను మట్టిలో కలిపేస్తాం

ఆ పార్టీలను మట్టిలో కలిపేస్తాం

యలమంచిలి: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మనుగడ లేకుండా మట్టిలో కలుపుతామని పీవీ రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాదరావు హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో సోమవారం యలమంచిలిలో మాల మహానాడు సమావేశం నిర్వహించారు. ముందుగా బాబా సాహెబ్‌ డా. బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుమ్మాపు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మాలలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆర్టికల్‌ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగదని తెలిసి కూడా రాజ్యాంగ విరుద్ధమైన పనులకు మద్దతు ఇవ్వడమంటే, కేవలం ఓటు బ్యాంకు రాజకీయ పరమైన కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాల, మాదిగలను విడగొట్టాలని 1997–98లో నారా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అప్పుడు మాలల పంతం చంద్రబాబు అంతం అనే నినాదంతో ఆ రోజు అధికారం కోల్పోవటం జరిగిందన్నారు. ఆ సంఘటన మర్చిపోయి మళ్లీ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చి కేవలం మాలలను కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. పూర్తిగా అవాస్తవంతో కూడిన రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను రద్దు చేసి, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణను నిలిపివేసి ప్రస్తుతం పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్‌ శాతాన్ని 20 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా యలమంచిలి మండల యూత్‌ విభాగం అధ్యక్షుడుగా జల్లి అనిల్‌ను నియమించి నియామాకపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పితాని పుష్పరాజ్‌, రాష్ట్ర లీగల్‌ అడ్వైజర్‌ కార్యదర్శి బండి సుందరరామూర్తి, నియోజకవర్గ కన్వీనర్‌ బుంగా జయరాజ్‌, ఎస్సీ ఉద్యోగుల సంఘం మండల నాయకులు ముడకల గోపాలరావు, బొంద బుజ్జిబాబు, కప్పల బన్నీ, సోడగిరి ప్రదీప్‌, జల్లి విజయరాజు, రాపాక సుధీర్‌, తోట ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణపై పీవీ రావు మాల మహానాడు ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement