ఖండ్రిక కాలువ ప్రక్షాళనకు ప్రతిపాదనలు
నిడమర్రు: కొల్లేరు అభయా రణ్య పరిధిలో అక్రమ ఆక్వా సాగుపై శనివారం ‘సాక్షి’లో ప్రచురించిన ‘కొల్లేరు అభయారణ్యం.. ఆక్రమణలే సర్వం’ శీర్షికన కథనానికి జిల్లా అటవీ శాఖ అధికారులు స్పందించా రు. జిల్లా అటవీ శాఖ అధికారి (వన్యప్రాణి యాజమాన్యం) డి.విజయ దేవరగోపవరంలో 5వ కాంటూరులోపు అక్రమ సాగు చేస్తున్న ఆక్వా చెరువులు, విద్యుత్ తీగలు, బోర్లను పరిశీలించారు. బహిరంగంగా విద్యుత్ తీగలు కనిపిస్తున్నా ఏం చేస్తున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్ చేస్తామని సిబ్బందిపై ఆమె మండిపడ్డారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు రైతులతో మాట్లాడారు. పెదనిండ్రకొలను నుంచి దేవరగోవపరం మీదుగా కొల్లేరులో కలిసేలా 2.5 కిలోమీటర్లు మేర ఖండ్రిక పంట కాలువ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పెదనిండ్రకొలను గ్రామ పరిధిలో కాలువ ఆక్రమణలు లేవని, దేవరగోపవరం 5వ కాంటూరు పరిధి నుంచి ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించారు. సుమారు కిలోమీటరు మేర ఖండ్రిక పంట కాలువ తొమ్మిది ఆక్వా చెరువుల మధ్యలో ఉన్నట్టు గుర్తించారు. ఆయా చెరువుల నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నట్టు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఆక్రమిత పంట కాలువ 5వ కాంటూరు పరిధిలో ఉండటంతో కాలువ ప్రక్షాళనకు ప్రభుత్వ అనుమతి కోరడంతోపాటు కాలువ తవ్వేందుకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించిన రూ.11.80 లక్షల నిధులు మంజూరు చేసేలా నివేదిక పంపుతామన్నారు. ఏలూరు రేంజర్ అధికారి మోహిని విజయలక్ష్మి, అటవీ సిబ్బంది ఉన్నారు.
కొల్లేరులో ఆక్రమణదారులకు నోటీసులు