తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 12వ వార్డు పాతూరు సచివాలయం సమీపంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ, స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ టీకాలు వేసేందుకు ప్రత్యేక కేంద్రాన్ని నిర్మించారు. తాడేపల్లిగూడెం, తణుకు పరిధిలో కుక్కలకు ఇక్కడ ఆపరేషన్లు చేస్తారు. రూ.18 లక్షలతో నిర్మించిన ఈ కేంద్రంలో కుక్కలకు ఆపరేషన్ చేసేందుకు ఆపరేషన్ థియేటర్, డాక్టర్ రూం, స్టోర్ రూం, స్టెరిలైజేషన్, హీటర్ రూంలతో పాటు కుక్కలను ఉంచేందుకు 37 బోనులు అందుబాటులో ఉంచారు. స్నేహ యానిమల్ వెల్ఫేర్ ఏజెన్సీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు వెటర్నరీ వైద్యులు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో స్నేహ సిబ్బంది ఆపరేషన్ చేసే ముందురోజు కుక్కలను పట్టుకుని బోనులోకి తరలిస్తారు. తరువాత రోజు డాక్టర్, సహాయకుల పర్యవేక్షణలో ఆపరేషన్లు చేస్తారు. అబ్జర్వేషన్ కోసం మూడు రోజులు కుక్కను బోనులో ఉంచుతారు. ఈ సమయంలో వాటికి అవసరమైన ఆహారం, మంచినీరు అందజేస్తారు. సెంటరులో ఎలాంటి దుర్వాసన రాకుండా శానిటేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. కోలుకున్న తరువాత కుక్కలను ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలేస్తారు. కుక్కకు రూ.1500 చొప్పున ఏజెన్సీకి ప్రభుత్వం ఇస్తుంది. మున్సిపల్ డీఈ నాగిరెడ్డి రామారావు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులలో 1,150 కుక్కలకు, తణుకు మున్సిపాలిటీ పరిధిలో 500 కుక్కలకు ఈ ఆపరేషన్లు చేస్తారన్నారు. ఇప్పటికే పట్టణంలో 450 కుక్కలకు ఏఆర్‌వీ వ్యాక్సిన్ అందజేసినట్లు చెప్పారు. నిరంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.
కుక్కల సంతతి తగ్గేనా...
తాడేపల్లిగూడెం పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. పురపాలక సంఘం ఆధ్వర్యంలో కుక్కలకు ఆపరేషన్లు చేయడం ద్వారా వాటి సంతతి తగ్గుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
తాడేపల్లిగూడెంలో ప్రత్యేక కేంద్రం
కుటుంబ నియంత్రణ, స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సల నిర్వహణ
వీధి కుక్కలకు ఆపరేషన్లు