ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా తడికలపూడి మండలం జీలకర్రగూడెంలో గుంటుపల్లి గుహల వద్ద బాలికపై నలుగురు అగంతకులు లైంగికదాడికి పాల్పడి ఆపై హతమార్చిన ఘటనలో నిందితులకు జీవిత ఖైదును విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. శుక్రవారం రాత్రి ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 24న ఉదయం 11 గంటలకు గుంటుపల్లి గుహల వద్దకు సరదాగా గడిపేందుకు వచ్చిన ప్రేమ జంటపై నలుగురు అగంతుకులు దాడి చేశారు. బాలికపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన ప్రియుడిని సైతం దుంగకర్రతో కొట్టి గాయపర్చారు. దీనిపై గుహల ప్రాంతంలో ఆర్కియోలాజికల్ సర్వే సిబ్బంది వడమాల మునిరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దోచుకునేందుకు వెళ్లి.. హతమార్చి..
నిందితులను కృష్ణా జిల్లా మైలవరం మండలం చండ్రారం గ్రామానికి చెందిన పొట్నూరి రాజు, ద్వార కాతిరుమల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సోమయ్య, తుపాకుల గంగయ్య, కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిసిలాల గ్రామానికి చెందిన కొమరగిరి నాగరాజుగా గుర్తించారు. వీరు ఒంటరిగా ఉన్న ప్రేమ జంటను గమనించి వారిని దోచుకునేందుకు వెళ్లారు. కత్తి, దుంగకర్రతో ప్రేమ జంట వద్దకు వెళ్లిన వీరు డబ్బులు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో పొట్నూరి రాజు దుంగకర్రతో తీవ్రస్థాయిలో తలపై కొట్టడంతో ప్రియుడు అక్కడే పడిపోయాడు. అనంతరం బాలిక వద్దకు వెళ్లి ఆమె దుస్తులను చించివేసి కర్రతో తలపై బలంగా కొట్టి లైంగికదాడికి పా ల్పడ్డారు. తీవ్ర గాయాలైన ప్రియుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఆరేళ్ల పాటు ఏలూరు పోక్సో కోర్టులో విచారణ కొనసాగింది.
జీవిత ఖైదు.. రూ.10 వేల జరిమానా
పోక్సో కోర్టు న్యాయమూర్తి సునంద శుక్రవారం తుది తీర్పును వెల్లడించారు. నలుగురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఐపీసీ 397, 376 (ఎ), సెక్షన్ 4 పోక్సో, 302 ఐపీసీ, 25 (1ఎ) భారతీయ ఆయుధాల చట్టం, 27 భారతీయ ఆయుధ చట్టం మేరకు కఠిన శిక్షలు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మృతురాలు తల్లిదండ్రులకు రూ.3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రియుడు నవీన్‌కుమార్‌కు తగిన పరిహారం అందజేయాలని డీఎల్‌ఎస్‌ఏ ఏలూరుకు లేఖ రాశారు. పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోనే సీతారామ్ బాధితుల తరఫున వాదించగా అప్పటి చింతలపూడి సీఐ యూజే విల్సన్, మరో సీఐ పి.రాజేష్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసుపై రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. విలేకరుల సమావేశంలో ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ హబీబ్‌బాషా, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, డీసీఆర్‌బీ ఎస్సై రాజారెడ్డి, తడికలపూడి ఎస్సై చెన్నారావు, ఏపీపీ డీవీ రామాంజనేయులు పాల్గొన్నారు.
లైంగికదాడి ఆపై హత్య
శిక్ష ఖరారు చేసిన పోక్సో కోర్టు
2019లో గుంటుపల్లి గుహల వద్ద ఘటన