20 వేల కిలోమీటర్లు వచ్చి.. గుడ్లు పెట్టి..
తాము జన్మించిన చోటే మళ్లీ గుడ్లు పెట్టే జీవి సముద్ర తాబేలు మాత్రమే. వీటిలో ఎన్ని రకాలున్నా సముద్ర పర్యావరణాన్ని కాపాడటంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ముఖ్యమైనవి. ఇవి రెండడుగుల వరకు పొడవు, సుమారు 500 కేజీల వర కు బరువు ఉంటాయి. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ తాబేళ్లు ఎక్కువగా జపాన్, ఆస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో కనిపిస్తాయి. జీవితాంతం సముద్రంలో గడిపే ఈ జీవులకు స్థిర నివాసం ఉండదు. కేవలం గుడ్లు పెట్టేందుకు మాత్రమే భూమి మీదకు వస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. ఏటా అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఒడిసా, ఆంధ్రప్రదేశ్‌లోని ఒడ్డుకు చేరుకుని ఒక్కో తాబేలు 60 నుంచి 150 గుడ్లు పెట్టి ఎవరూ గుర్తుపట్టకుండా ఇసుకతో కప్పేసి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. రాష్ట్రంలోని సూర్యలంక, పలుచోట్ల వీటి సంరక్షణకు గతంలోనే కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటి మాంసానికి ఎక్కువగా డిమాండ్ ఉండటంతో కొందరు వీటిని వేటాడి మాంసాన్ని అమ్ముతుంటారు. ఇవి అంతరించిపోకుండా సముద్ర తాబేళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జాబితాలో చేర్చి సంరక్షిస్తోంది.
సాక్షి, భీమవరం/ నరసాపురం రూరల్: ఉభయ చరజీవుల్లో తాబేళ్లు ఒకటి. తాబేళ్లలో పలురకాలు ఉన్నా ఆలివ్ రిడ్లే రకం వెరీ స్పెషల్. తాబేళ్ల జాతుల్లో ప్రత్యేకమైనవిగా చెప్పుకునే ఆలివ్ రెడ్లీ తమ సంతానోత్పత్తికి పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుంటున్నాయి. ఇటీవల దీనిని గుర్తించిన జిల్లా అటవీ శాఖ వాటి గుడ్ల కోసం చినమైనివాలంకలో తొలిసారిగా సంరక్షణ కేంద్రం ఏర్పాటుచేసింది. ఇప్పటివరకూ 116 తాబేళ్లకు చెందిన 12,341 గుడ్లను సేకరించి వాటి నుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు వీలుగా ఇక్కడ భద్రపరిచారు.
19 కిలోమీటర్ల తీరం
జిల్లాలోని నరసాపురం మండలం మర్రితిప్ప నుంచి మొగల్తూరు మండలం మోళ్లపర్రు వరకు 19 కి లోమీటర్లు మేర సముద్ర తీరం ఉంది. ఈ ఏడాది జనవరిలో పదుల సంఖ్యలో మృత ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెదమైనివానిలంక, చినమైనివానిలంక గ్రామాల్లోని తీరానికి కొట్టుకురావడాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో చినమైనివానిలంక తీరంలోని ఓ చోట తాబేలు గుడ్లు ఉండటాన్ని గుర్తించిన అధికారులు సంతానోత్పత్తికి తాబేళ్లు ఇక్కడికి వస్తున్నాయని నిర్ధారించారు. కుక్కలు, ఇతర జంతువులు, ఆకతాయిలు నుంచి గుడ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. ముందుగా గుర్తించిన గుడ్లను తరలించే వీలులేక వాటి రక్షణ కోసం చుట్టూ పొదలను ఏర్పాటుచేశారు.
జిల్లాలో తొలిసారిగా..
తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని తొలిసారిగా జిల్లాలోని చినమైనివానిలంక తీరం వద్ద జనవరిలో అటవీశాఖ ఏర్పాటు చేసింది. రోజూ సంరక్షణ కేంద్రం సిబ్బంది తీరం వెంబడి తిరుగుతూ తాబేలు అడుగుల ఆనవాళ్లను బట్టి గుడ్లు పెట్టిన చోటును గుర్తిస్తున్నారు. తాబేలు గుడ్లు పెట్టిన తర్వాత అవి దెబ్బతినకుండా రక్షణ కోసం పైపొరగా వాటిపై రసాయనాలు విడుదల చేస్తుంది. ఈ రక్షణ పొర దెబ్బతినకుండా జాగ్రత్తగా గుడ్ల ను సేకరిస్తున్నారు. సంరక్షణ కేంద్రంలో 10 అంగుళాల లోతులో గుండ్రపు గొయ్యి తీసి వాటిలో 100 నుంచి 150 వరకు గుడ్లను పెట్టి ఇసుకతో కప్పుతున్నారు. గత రెండు నెలల్లో 12,341 గుడ్లు సేకరించి హేచరీలో భద్రపరిచారు. గొయ్యిలోని గుడ్లను ఎప్పుడు సేకరించింది?, ఎన్ని భద్రపరచిందనే వివరాలను గొయ్యి వద్ద స్లిప్పులపై నమోదుచేస్తున్నారు. సహజసిద్ధంగా రెండు నెలల వ్యవధిలో గుడ్ల నుంచి తాబేలు పిల్లలు బయటకు వస్తాయని అటవీ అధికారులు తెలిపారు. సముద్ర జీవులపై స్థానికులకు అవగాహన కలిగేలా తాబేలు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టే కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తామన్నారు.
కడలి తీరం.. కూర్మాల ఆవాసం
సంతానోత్పత్తి కోసం సముద్ర తాబేళ్ల రాక
గుర్తించిన అటవీ శాఖ
గుడ్ల సంరక్షణకు హేచరీ
చినమైనివానిలంక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
ఇప్పటివరకూ 12,341 గుడ్ల సేకరణ
తాబేళ్ల సంరక్షణకు చర్యలు
పర్యావరణ సమతుల్యతకు సముద్ర జీవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చినమైనివానిలంక వద్ద తాబేళ్ల గుడ్ల సంరక్షణకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో వాటి రాకకు ఆటంకం కలగకుండా స్థానికులు సహకరించాలి. – చదలవాడ నాగరాణి, కలెక్టర్
రూ.10 లక్షలతో బడ్జెట్
జిల్లాలోని తీర ప్రాంతంలో గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు రావడం గుర్తించి తొలిసారిగా సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. రానున్న సీజన్‌లో లక్షకు పైగా గుడ్లను సంరక్షించే లక్ష్యంతో శాశ్వత సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.10 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – కిరణ్, జిల్లా అటవీశాఖ అధికారి.
పశ్చిమ తీరానికి ఆలివ్ రిడ్లే
పశ్చిమ తీరానికి ఆలివ్ రిడ్లే
పశ్చిమ తీరానికి ఆలివ్ రిడ్లే
పశ్చిమ తీరానికి ఆలివ్ రిడ్లే
పశ్చిమ తీరానికి ఆలివ్ రిడ్లే
పశ్చిమ తీరానికి ఆలివ్ రిడ్లే