ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దేశంలోని రవాణా రంగ కార్మికులకు ఒక సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న చలో పార్లమెంట్ కార్యక్రమానికి ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల స్థానంలో దేశవ్యాప్తంగా విద్యుత్ బస్సులను తీసుకొని భవిష్యత్తులో ఆర్టీసీలను కనుమరుగు చేయాలని కేంద్ర ప్రభుత్వం పథకం వేసిందనీ, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం– ఈ బస్సు స్కీము కూడా ఇందులో భాగమే అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడి ఆర్టీసీలను కాపాడుకోవాలనీ, ఈనెల 24న ఢిల్లీలో భారీ ప్రదర్శనతో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర, ఎస్‌బీ అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్, డిపో అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ ప్రసాద్, టీకే రావు తదితరులు పాల్గొన్నారు.
చెల్లని చెక్కు కేసులో జైలు శిక్ష, జరిమానా
నూజివీడు: చెక్కు చెల్లని కేసులో ఒక వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చెందిన ముసునూరు ప్రభుదాస్‌కు గోపవరంనకు చెందిన వల్లభనేని గోపాలకృష్ణ 2017 జూన్ 25న రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత బాకీ చెల్లించే నిమిత్తం ప్రభుదాస్ రూ.5 లక్షల చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును గోపాలకృష్ణ బ్యాంకులో వేయగా ప్రభుదాస్ బ్యాంకు ఖాతాలో నగదు లేదని బ్యాంకు అధికారులు చెక్కును తిప్పి పంపారు. దీంతో గోపాలకృష్ణ కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం స్పెషల్ మేజిస్ట్రేట్ ప్రభుదాస్‌కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.
అనుమానాస్పద స్థితిలో రిటైర్డ్ ఉద్యోగి మృతి
చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ పాత చింతలపూడి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డి హేమ ప్రకాష్(65) రిటైర్డ్ ఉద్యోగి. పాత చింతలపూడిలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అప్పటికే ప్రకాష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా హేమ ప్రకాష్‌ను ఆస్తి కోసం కుటుంబ సభ్యులే కొట్టి చంపారని మృతుని సోదరుడు మోహన్ ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రకాష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ఎస్సై కుటుంబరావు దర్యాప్తు చేస్తున్నారు.