
మహిళలపై నేరాల కట్టడికి శక్తి బృందాలు
భీమవరం: మహిళలపై నేరాలు అరికట్టడానికి, వారి భద్రతకు భరోసాగా జిల్లా వ్యాప్తంగా 30 మంది సిబ్బందితో 5 శక్తి బృందాలు ఏర్పాటు చేసినటు్‌ల్ ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన శక్తి టీంలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. శక్తి టీంలు జిల్లాలోని కళాశాలలు, పార్కులు, ఆర్టీసీ బస్టాండ్‌లు, ముఖ్య కూడళ్లలో మఫ్టీలో ఉంటారని, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కవచంగా నిలిచేలా పనిచేస్తారని చెప్పారు. ఆపద సమయంలో శక్తి యాప్స్‌కు వచ్చే ఎస్‌ఓఎస్ కాల్స్, డయల్ 112, 100 కాల్స్‌తో సంఘటనా స్థలానికి తక్షణం టీంలు వెళ్తాయన్నారు. యాప్‌లోని ఎస్‌ఓఎస్ ఆప్షన్ నొక్కితే వారి లొకేషన్, వీడియో, ఆడియో కంట్రోల్ రూంకు చేరుతుందన్నారు. అంతేకాకుండా ఫోన్ ఊపినా సమాచారం పోలీసులకు చేరుతుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) వి.భీమారావు తదితరులు పాల్గొన్నారు.