బుట్టాయగూడెం/పాలకోడేరు: భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటివారం నుంచే ఒకపక్క తీవ్రమైన ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తాటి ముంజెలు, పుచ్చకాయలు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. పుచ్చకాయ శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు చలువ చేస్తుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో.. పుచ్చకాయల కొనుగోలుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మార్కెట్లో కిలో పుచ్చకాయ ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతుంది. మన జిల్లాలో సుగర్ బేబీ, నాన్దారి, ఆర్క్మెన్ తదితర రకాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
పుచ్చకాయతో ప్రయోజనాలు
పుచ్చకాయలు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. పుచ్చలో విటమిన్ బి, పొటాషియం, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం లభించి.. తక్షణ శక్తి నిస్తుంది. ఆల్క్లైన్తో పాటు పీచు పదార్థం ఉండడం వల్ల మూత్ర పిండాలకు ఎంతో ఉపయోగకరం. 100 గ్రాముల పుచ్చకాయలో 91.45 గ్రాముల నీరు, 6 శాతం చక్కెర , 30 క్యాలరీల శక్తి, 7.6 గ్రాముల పిండి పదార్ధాలు, 0.6 గ్రాముల మాంసకృత్తులు, 12 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కాల్షియం ఉంటాయి.
వేసవి తాపం తగ్గించే ముంజెలు
తాటి ముంజెలు ఎండాకాలంలో మాత్రమే లభిస్తుంటాయి. వేసవి తాపాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్య రక్షణలో ఎంతో ఉపయోగపడతాయి. ఎండలు తీవ్రంగా ఉండటంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో, రోడ్ల వెంట తాటి ముంజలు ఏజెన్సీ ప్రాంతంలో విక్రయిస్తూ అనేక మంది వ్యాపారులు కనిపిస్తున్నారు. మార్కెట్లో ముంజెల వ్యాపారం చేసే వ్యాపారులకు మార్చి, ఏప్రిల్, మే నెలలో అధికంగా ఆదాయం వస్తుంది. తాటి ముంజలు 12 ముంజెలు రూ.40కు విక్రయిస్తుండగా మరి కొందరు 18 ముంజులు రూ.50 విక్రయిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో సుమారు 75 కుటుంబాలకు పైగా ముంజెలు, తాటి ఆకుల విక్రయాలతో వేసవి కాలంలో జీవనం సాగిస్తున్నారు.
తాటి ముంజెలతో ఉపయోగాలు
● ఎన్ని నీళ్లు తాగినా అలసిపోయివారు.. తాటి ముంజెలు తినడం వల్ల చలాకీగా ఉంటారు.
● తాటి ముంజెల్లో ఏ, బీ, సీ విటమిన్లతో పాటు జింక్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
● వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వ్యక్తుల బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.
● శరీరంలో శక్తిని పెంచి అలసటను దూరం చేస్తుంది.
పుచ్చకాయలు, ముంజెలకు వేసవిలో డిమాండ్
జోరందుకుంటున్న అమ్మకాలు
ముంజెలతో వేసవిలో మంచి ఆరోగ్యం
వేసవి కాలంలో ప్రకృతి సిద్దంగా లభించే తాటి ముంజెలు తినడం మంచిది. ఈ ముంజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఎండలో తిరిగేవారు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా తాటి ముంజలు ఎంతగానో పనిచేస్తాయి. డాక్టర్ సుధీర్,
వైద్యుడు, బుట్టాయగూడెం సీహెచ్‌సీ
వేసవిలో ఎంతో ప్రయోజనకరం
పుచ్చకాయ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనిని తినవచ్చు. వేసవి తాపం నుంచి రక్షణ పొందవచ్చు.
చినమిల్లి రంగమనాయుడు, పీహెచ్సీ వైద్యాధికారి, పాలకోడేరు
వేసవి తాపానికి ఉపశమనం
వేసవి తాపానికి ఉపశమనం
వేసవి తాపానికి ఉపశమనం