బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ఈనెల 14న జాతర ప్రారంభం కాగా.. మూడు రోజులపాటు గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బాలరాజును సత్కరించారు. ఆఖరి రోజు సుమారు 11 వేల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించినట్టు ఆలయ కమిటీ ప్రతినిధి, సర్పంచ్ కోర్సా గంగరాజు తెలిపారు.
పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు
భీమవరం : జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని, పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున సమీపంలోని అన్ని జెరాక్సు సెంటర్లను మూసివేయిస్తామన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే 100 లేదా 112 నంబర్‌కు కాల్ చేయాలని, లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సులు
భీమవరం (ప్రకాశంచౌక్): ఏపీఎస్‌ఆర్టీసీ భీమవరం డిపో నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సు సర్వీసులు ఏర్పాటుచేసినట్టు డిపో మేనేజర్ పీఎన్‌వీఎం సత్యనారాయణమూర్తి తెలిపారు. భీమవరం నుంచి విశాఖ (వయా నవుడూరు, బ్రాహ్మణచెర్వు), భీమవరం నుంచి పలాస (వయా పాలకొల్లు, కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం, టెక్కలి) సర్వీసులను ఆదివారం పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అంజిబాబు జెండా ఊపి ప్రారంభించారన్నారు. జిల్లాలోని నవుడూరు, పొలమూరు, బ్రాహ్మణచెర్వు గ్రామాల ప్రజ లు నేరుగా విశాఖ వెళ్లేందుకు ఈ సర్వీసులు దోహదపడతాయన్నారు.
కోకో నాణ్యత పెంచేలా శిక్షణ
ఏలూరు(మెట్రో): కోకో గింజల నాణ్యత పెంచేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎస్.రామ్మోహన్ తెలిపారు. నాణ్యమైన గింజలు లేకపోవడంతో ధర రావడం లేదన్నారు. గింజల నాణ్యతలో కీలకమైన ఫైర్మెంటేషన్, ఎండబెట్టడం, శుభ్రమైన ప్రదేశాల్లో భద్రపరచడం వంటి మెలకువలపై మోండలీజ్ సాంకేతిక అధికారుల సమన్వయంతో గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆదివారం రామశింగవరం, కొండలరావుపాలెం, చక్రదేవరపల్లి, వంగూరు, తాళ్లగోకవరం తదతర గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రైతులు అవగాహన పెంచుకుని గింజల నాణ్యతకు తగు జా గ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వడదెబ్బపై అప్రమత్తం
ఏలూరు(మెట్రో): రోజురోజుకూ వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. ఎండ తీవ్రత, వడగాల్పులు సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకొని, కాటన్ వస్త్రాలు ధరించాలని సూచించారు. తరచూ నీరు, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్, ఓఆర్‌ఎస్ కలిపిన నీటిని తాగాలన్నారు. అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.