
అలరించిన కళాపరిషత్ నాటికలు
పాలకొల్లు సెంట్రల్: కళలకు నిలయమైన పాలకొల్లు పట్టణంలో పాలకొల్లు కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం స్థానిక బస్టాండ్ వద్ద అడబాల థియేటర్ వెనుక ఖాళీ స్థలంలో నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు విడాకులు కావాలి, కిడ్నాప్ నాటికలు ప్రదర్శించారు. దాంపత్య జీవితంలో దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, అపోహలు, చిన్నచిన్న సమస్యలు తలెత్తటం సహజమని అంతమాత్రాన్న పట్టింపులకు పోయి విడాకులు కావాలనుకోవడం సమంజసం కాదనే కథాశంతో విడాకులు కావాలి అన్న నాటిక ప్రదర్శించారు. ఈ నాటికను వల్లూరు శివప్రసాద్ రచించగా.. గంగోత్రి సాయి దర్శకత్వం వహించారు. కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తెలియజెప్పే సందేశంతో కిడ్నాప్ నాటిక కళా ప్రియులను ఆకట్టుకుంది. ఈ పోటీల్ని మంత్రి రామానాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకటసత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, కళాపరిషత్ అధ్యక్షుడు కె.వి.కృష్ణవర్మ, సెక్రటరీ మానాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన కళాపరిషత్ నాటికలు