
కొనుగోలు కేంద్రాలు ఎక్కడ?
దెందులూరు: ఏలూరు జిల్లాలో పెసర, మినుము రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఆశలు పెట్టుకుంటే ఇంతవరకూ వాటి ఊసే లేదు. గత ఏడాది నవంబర్‌లో పెసర, మినుము పంట సాగు చేశారు. ఫిబ్రవరి నెలాఖరుకు దిగుబడి చేతికొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో పంటల సాగు పూర్తయ్యే నాటికి రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం ఇంతవరకూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు దెందులూరు కోపరేటివ్ సొసైటీకి వెళ్లి నిలదీశారు.
ఏలూరు జిల్లాలో 12,900 ఎకరాల్లో పెసర, 2500 ఎకరాల్లో మినుము పంట సాగు చేశారు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఇవ్వకపోయినా పండించిన పంటను కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఎలా? అని రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే తక్కువ ధరకు అమ్ముకోవాలని.. పెట్టుబడి సొమ్ము కూడా అందదని వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మాట్లాడడం లేదు. జాయింట్ కలెక్టర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినా.. ఆ ఆదేశాలు అమలు కాలేదు. పండించిన పంటను మంచి ధరకు అమ్ముకోవచ్చని ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ మిగిలింది. ఇలాగైతే నష్టానికి అమ్ముకోవడం తప్ప వేరే గత్యంతరం లేదంటున్నారు.
ఇంకా పూర్తికాని ఈ–క్రాప్ నమోదు
వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నమోదు, రైతుల వివరాలు పంట వేసిన తరువాత రైతుతో మాట్లాడి ఈ–క్రాప్ నమోదు చేస్తారు. అయితే పంట చేతికి వచ్చిన తరువాత ఇప్పటికీ పంట నమోదు కార్యక్రమం చేస్తున్నారు. ఈ విషయాన్ని మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖాధికారులు ధ్రువీకరించారు.
పెసర, మినుము రైతుల ఆవేదన
పంటను నష్టానికి అమ్ముకోవాల్సిన దుస్థితి