
చిన్నారులపై మారుటి తండ్రి దాడి
జంగారెడ్డిగూడెం: చిన్నారులను పాశవికంగా హింసించిన ఘటన మరోసారి జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. రెండవ భర్త దాడిలో వివాహిత, ఆమె సంతానం దాడికి గురయ్యారు. పట్టణానికి అంకుశం జ్యోత్స్న, పూతి ఉమామహేశ్వరరావు భార్యభర్తలు. వీరి సంతానం సాత్విక్ (11) 4వ తరగతి చదువుతున్నాడు. కరుణ సత్య (8) 2వ తరగతి చదువుతున్నారు. కాగా జ్యోత్స్న ఉమామహేశ్వరరావుకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో పుచ్చకాయల దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం కాగా వారు గౌరీ పట్నంలో వివాహం చేసుకుని స్థానిక సుబ్బంపేట రోడ్డులో నివాసం ఉంటున్నారు. గత మూడు రోజులుగా దుర్గాప్రసాద్ మద్యం సేవించి వచ్చి పిల్లలు సాత్విక్, కరుణసత్యలను కొడుతూ ఉన్నాడు. అడ్డుకోబోయిన జ్యోత్స్నపై కూడా దాడి చేశాడు. స్థానికులు గమనించి గాయపడిన సాత్విక్‌ను శనివారం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు సాత్విక్‌కు చికిత్స అందిస్తుండగా, జ్యోత్స్న, కరుణసత్య ఆసుపత్రిలోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న సీడీపీవో బ్యూలా, సూపర్‌వైజర్, అంగన్‌వాడీ సిబ్బంది ఆసుపత్రికి వెళ్లి జ్యోత్స్న, చిన్నారులను అడిగి స్టేట్‌మెంట్ నమోదు చేసుకున్నారు. సీఐ వి.కృష్ణబాబు వివరాలు సేకరించారు. గతంలో కూడా దుర్గాప్రసాద్ తనను చంపడానికి ప్రయత్నించాడని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు జ్యోత్స్న తెలియజేసింది.
గాయపడిన చిన్నారి సాత్విక్‌కు ఏరియా ఆసుపత్రిలో చికిత్స
వివరాలు సేకరించిన అధికారులు

చిన్నారులపై మారుటి తండ్రి దాడి