
పది విజయానికి.. పన్నెండు సూత్రాలు
గణపవరం: విద్యార్థి జీవితంలో కీలకమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల గడువు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్ధుల్లో భయం, ఆందోళన, పెరిగిపోతోంది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో అయితే ఆందోళన మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిరంతర సాధన, గుండెలనిండా ధైర్యం, నమ్మకమే విజయతీరాలకు చేర్చుతుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రతి విద్యార్ధి పదోతరగతిలో విజయ కేతనం ఎగరవేయడానికి ఈ పన్నెండు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.
భయం వద్దు
అనవసర భయాలవల్ల టెన్షన్ వస్తుంది. పరీక్షలపై దృష్టిపెట్టి, ఆయా సబ్జెక్టుల్లో నిరంతర సాధన చేయాలి. విద్యార్థులు ప్రతి రోజూ పదినిముషాలపాటు ధ్యానం లేదా పూజ చేస్తే మంచిది.
సందేహమెందుకు ?
చదివిన ప్రశ్నలు రాకపోతే.. చదివింది గుర్తుకు రాకపోతే... లాంటి ఆలోచనలు దరిచేరనీయవద్దు.
ప్రణాళిక ముఖ్యం
ఎంత చదివామన్నది ముఖ్యంకాదు.. ప్రణాళికతో ఎలా చదివామన్నది ముఖ్యం.
జాగ్రత్త అవసరం
చదువు ధ్యాసలో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. వేళకు తేలికపాటి, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. పండ్లరసాలు, కొబ్బరిబొండం నీరు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
మంచి నిద్ర మేలు
సరైన మోతాదులో నిద్ర అవసరం. పరీక్షల సమయంలో అర్ధరాత్రి దాటే వరకూ చదవడం వల్ల ఉపయోగం ఉండదు. రాత్రి పదిగంటలకు పడుకుని, వేకువజామునే లేచి చదివితే మంచిది.
కొత్త విషయాల జోలికి పోవద్దు
పరీక్షల సమయంలో కొత్తవిషయాలు నేర్చుకునే ప్రయత్నం వద్దు. ఈ సమయంలో కేవలం రివిజన్ మాత్రమే చేయాలి. ఇదివరకు చదవని ప్రశ్నలు మరీ ముఖ్యమైనవి అయితేనే తప్ప నేర్చుకునే ప్రయత్నం చేయవద్దు.
సెల్‌ఫోన్లకు దూరం
పరీక్షల సమయంలో సెల్‌ఫోన్ చూడటం, సెల్‌ఫోన్ ముచ్చట్లు, ఫ్రెండ్స్‌తో చర్చలు అనవసరం.
ముందుగా వెళ్లడం శ్రేయస్కరం
పరీక్షకు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరండి. దారిలో ప్రయాణంలో చదవడం, పరీక్షా గదిలోకి వెళ్లేముందు ఓసారి పుస్తకం తీసి చూడాలన్న ఆలోచనే వద్దు.
ఇతరులను పట్టించుకోకండి
పరీక్ష రాసే సమయంలో పక్కకి చూడవద్దు. ఎవరు ఎన్ని ఎడిషనల్ షీట్లు తీసుకుని రాస్తున్నారన్నది పట్టించుకోకండి. అది మీలో తెలియని ఆందోళన పెంచుతుంది.
తెలిసిన ప్రశ్నలకు ముందు ప్రాధాన్యత
బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా జవాబులు రాయండి. సాధ్యమైనంత వరకూ దిద్దుబాటు లేకుండా చూడండి. టైం పూర్తయ్యేవరకూ పరీక్షాహాలు వదిలి రాకండి. హాల్‌టికెట్ నంబరు, ప్రశ్నల నంబర్లు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడం మంచిది.
ప్రశాంతంగా ఉండండి
మామూలు రోజుల్లో ఎలా ఉంటారో పరీక్షలప్పుడు కూడా అలాగే ప్రశాంతంగా ఉండండి. పరీక్షరాసిన వెంటనే ఇంటికి రావడం మంచిది. ఫలానా ప్రశ్నకు సమాధానం సరైనదేనా కాదా అంటూ స్నేహితులతో చర్చ పెడితే ఒకరు రైట్‌అని, మరొకరు రాంగ్ అని చెబితే మీరు పూర్తి కన్ఫ్యూజన్‌లోకి వెళ్లిపోయి, మరుసటి రోజు పరీక్షపై అనవసర భయం ఏర్పడుతుంది.
విసుక్కోవద్దు.. పోల్చవద్దు
తల్లిదండ్రులు పిల్లలను విసుక్కోవడం, చదవడంలేదని తిట్టడంవంటివి చేయవద్దు. పరీక్షలు రాస్తున్న పిల్లలను పంక్షన్‌లు వంటి ఇతర కార్యక్రమాలకు తీసుకెళ్లడం మంచిదికాదు. ముఖ్యంగా ఇతర విద్యార్ధులతో మీ పిల్లలను అస్సలు పోల్చవద్దు.
పునశ్చరణకే ప్రాధాన్యం
పరీక్షల సమయంలో కొత్తవి చదివేకన్నా పునశ్చరణకే ప్రాధాన్యత ఇవ్వాలి. పరీక్షరోజున వేకువజామునే లేచి కొంతసమయం ముఖ్య, అతి ముఖ్య ప్రశ్నలు ఒకసారి మననం చేసుకుంటూ చదివితే మంచిది. పరీక్ష పేపరులో అక్షరాలు పొందికగా, పెద్దగా, చూడముచ్చటగా ఉండాలి. ఇంగ్లీషులో గ్రామర్, లెక్కల్లో ఫార్ములాలు, సైన్సులో డయాగ్రమ్‌లు, సోషల్‌లో మ్యాప్‌లు బాగా ప్రాక్టీస్ చేయండి. పరీక్షల సమయంలో సెల్‌ఫోన్‌కు విశ్రాంతి ఇవ్వడం మరచిపోవద్దు.
– గొర్రెల బాలయ్య, సబ్జక్టునిపుణులు, ఎంఈవో–2
ఆహారపు అలవాట్లతో అప్రమత్తం
పరీక్షకు వెళ్లడానికి రెండుగంటల ముందు కొబ్బరినీళ్లు తాగాలి. తేనె, నిమ్మరసం, వేడి గంజి వంటివాటిలో ఏదైనా మంచిదే. దీనివలన శక్తి వస్తుంది. బయట ఆహారం, ఫాస్ట్‌ఫుడ్స్‌వంటి వాటికి దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. మొలకలు, క్యారెట్, కీరదోస వంటివి తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఇవి శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి.
– పి.కిరణ్మయి. వైద్యాధికారిణి

పది విజయానికి.. పన్నెండు సూత్రాలు

పది విజయానికి.. పన్నెండు సూత్రాలు