
పోక్సోపై అవగాహన అవసరం
భీమవరం: పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జి.సురేష్ బాబు అన్నారు. మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పోక్సో చట్టంపై అవగాహన కల్పనకు ప్రభుత్వ కళాశాల ఉమెన్స్ హాస్టల్‌లో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రధానంగా 18 ఏళ్లలోపు బాలికలు అపరిచిత వ్యక్తుల పట్ల ఆకర్షితులు కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. చదువుపై మాత్రమే దృష్టి పెట్టి అవసరమైన వాటికి మాత్రమే సెల్ ఫోన్స్ ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి యోహాన్, ప్యానల్ న్యాయవాదులు బి.సురేష్ కుమార్, ఎన్.సుధీర్, పి.అంబేద్కర్, బి.లోకేశ్వరరావు, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
అబద్ధాలు చెప్పడంలో బాబు, లోకేష్ దిట్ట
పాలకొల్లు సెంట్రల్: అబద్ధాలు వల్లించడంలో చంద్రబాబును మించిన ఘనుడు నారా లోకేష్ అని వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు(గోపి) అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అబద్ధాలు వల్లిస్తూనే తండ్రీకొడుకులు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తన కుమారుడు దేవాన్ష్‌కు సెల్‌ఫోన్ లేదని, ట్యాబ్ లేదని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన కొడుక్కే లేవు మీకెందుకని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కించపరుస్తున్నారా? అని ప్రశ్నించారు. ఓ పక్క తన మనవడు సెల్‌ఫోన్ ఆపరేట్ చేయడంలో గొప్పని చంద్రబాబు చెప్పుకుంటారని, లోకేష్ ఏమో అసలు పోనే లేదని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. గతంలో జగనన్న ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లిచ్చి డిజిటల్ విద్యను అందించిందన్నారు. టీడీపీ నాయకులకు గతంలో చంద్రన్న తోపా, చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న సంక్రాంతి అంటూ సంచులపై ఫొటోలు వేయించుకున్న విషయాలు మర్చిపోయారా చెట్లు, పుట్లపై కూడా రంగులు వేసుకున్న గత విషయాలు గుర్తుకు రావడంలేదా అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కర్రా జయసరిత, జోగి వెంకటేశ్వరరావు, జోగాడ ఉమామహేశ్వరరావు, మామిడిశెట్టి చిట్టిబాబు, అరుణ, కెల్లా పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారికి వైభవంగా డోలా పౌర్ణమి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శుక్రవారం డోలా పౌర్ణమి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవేరులతో శ్రీవారు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ముందుగా ఆలయంలో ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు. ఆ తర్వాత శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా తిరువీధులకు పయనమైంది.
నాగర్‌సోల్‌కు చర్లపల్లిలో మాత్రమే స్టాప్
నరసాపురం: రెండు ప్రధాన ట్రైన్లు ఈ నెల 25 నుంచి సికింద్రాబాద్‌లో ఆపకుండా చర్లపల్లిలో మాత్రమే ఆపాలని నిర్ణయించింది. 12787, 12788 నరసాపూర్ –నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్, 17231, 17232 నరసాపూర్ సూపర్ ఫాస్ట్ రైళ్లు ఈ నెల 25 నుంచి సికింద్రాబాద్‌లో ఆగకుండా చర్లపల్లి, మౌలాలి మీదుగా నడుస్తాయని నరసాపురం రైల్వేస్టేషన్ మేనేజర్ మధుబాబు చెప్పారు. చర్లపల్లిలో దిగి సికింద్రాబాద్‌కు రావాలంటే మళ్లీ వెనక్కి ప్రయాణించాలి. నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ ద్వారా పెద్దసంఖ్యలో పగటిపూట హైదరాబాద్ ప్రయాణాలు చేస్తున్నారు.

పోక్సోపై అవగాహన అవసరం